ఆరోగ్య సేతు యాప్‌తో ప్రజల డేటాకు ఎటువంటి భద్రతా సమస్యలు లేవని ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్ .. హ్యాకింగ్‌కు వీలుగా ఉన్నట్లు ఓ ఫ్రెంచ్ హ్యాకర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. సుమారు 90 మిలియన్ల మంది భారతీయుల ప్రైవసీ ప్రమాదంలో ఉన్నట్లు ఆ హ్యాకర్ హెచ్చరించాడు. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఓ సుదీర్ఘమైన వివరణతో కూడిన ప్రకటన చేసింది. ఆరోగ్య సేతు యాప్‌తో డేటా కానీ.. సెక్యూర్టీ చోరీ కానీ లేదని స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్ వాడుతున్న వారి పర్సనల్ డేటాకు ప్రమాదం ఏమీ లేదని, హ్యాకర్ చెప్పినట్లు జరగడం లేదని కేంద్రం పేర్కొన్నది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులను పసికట్టేందుకు ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కచ్చితంగా ఈ యాప్‌ను డౌనలోడ్ చేసుకోవాలని, లేదంటే వారికి జరిమానా కూడా విధించనున్నట్లు పేర్కొన్నది. అయితే హ్యాకర్ ఇలియట్ ఆల్డర్సన్ ఆ యాప్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలోనూ ఆధార్ యాప్‌ను తప్పుపట్టిన ఆ హ్యాకర్ ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్‌లో సెక్యూర్టీ సమస్యలు ఉన్నట్లు చెప్పాడు. కాంగ్రెస్ నేత రాహుల్ చెప్పినట్లే ఆరోగ్య సేతు యాప్‌తో సెక్యూర్టీ సమస్య ఉన్నట్లు హ్యాకర్ పేర్కొన్నాడు.