వన్‌ బై టు చాయ్‌తో వంద మందికి కరోనా



  • ఏపీలో 60 పాజిటివ్‌ కేసులు 



ఇద్దరు దోస్తులు తాగిన వన్‌ బై టు చాయ్‌.. దాదాపు 100 మందికి కరోనా అంటుకొనేలా చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గతనెల 7న ఓ కేబుల్‌ ఆపరేటర్‌ అస్వస్థతకు గురై మృతిచెందాడు. చనిపోయాక పాజిటివ్‌గా నిర్ధారణవడంతో, కరో నా ఎలా సోకిందో పోలీసులు విచారణ చేపట్టారు. కేబుల్‌ ఆపరేటర్‌ స్నేహితుడు మార్చిలో మర్కజ్‌ వెళ్లొచ్చాడు. 23న  ఇద్దరు వన్‌ బై టు చాయ్‌ తాగారు. అక్కడే కేబుల ఆపరేటర్‌కు వైరస్‌ సోకింది.  అతని ద్వారా మరో 100 మందికి కరోనా వ్యాప్తి చెందినట్టు పోలీసుల విచారణలో తేలింది. కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ)లో ఇప్పటికే వైద్యుడు మృతిచెందగా.. తాజాగా హాస్టల్‌ వంటమనిషికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో హాస్టల్‌ను అధికారులు ఖాళీ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసు లు శుక్రవారం మరో 60 నమోదయ్యాయి. దీంతో ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1463కు చేరింది. నెల్లూరు, కర్నూల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 33కు చేరింది. కర్నూల్‌, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.