టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం నిజామాబాద్‌లోని ఫార్మ్ హౌస్‌లో రాత్రి 11.30 గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహ వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని తెలుస్తుంది. ఆమె పేరు తేజస్విని (వైగా రెడ్డి). ఈమె ఎయిర్‌హోస్టెస్‌గా కూడా చేసినట్టు సమాచారం. తాజాగా దిల్ రాజు పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించడంతో కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు. జీవితంలో తనకు ఓ తోడు కావాలని భావించిన ఆయన రెండో పెళ్ళి చేసుకున్నారు. కూతురు హన్సితాతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన తండ్రికి ప్రత్యేక నోట్ ద్వారా శుభాకాంక్షలు అందించింది దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి. డియర్ డాడ్.. నువ్వు నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచావు. మీ వలన అందరం సంతోషంగా ఉన్నాం. మన కుటుంబ సంతోషం కోసం మీరు ఎన్నో చేశారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. మీరిద్దరు సంతోషంగా ఉండాలని, ప్రతి రోజు అద్భుతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని హన్సిత ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం దిల్‌రాజు ‘వీ’ ‘వకీల్‌సాబ్' చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ‘వీ’ సినిమా విడుదల కరోనా ప్రభావంతో వాయిదా పడింది.