- మరణించిన ప్రతి ఒక్కరికి రూ. కోటి ఆర్ధిక సాయం : సీఎం వైఎస్ జగన్
- విశాఖ లో పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం చాలా విషాదకరం
- చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి పరామర్శ.
- ప్రతి గ్రామస్తునికీ రూ. 10 వేల రూపాయల ఆర్ధిక సాయం.
- రాష్ట్ర యంత్రాంగం మొత్తం విశాఖకు తరలి వచ్చింది.
విశాఖ : ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘ఈ సంఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది.
ఇక మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా… మనసున్న మనిషిగా బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం. అంతేకాకుండా హాస్పటల్‌లో వైద్యం పొందుతున్నవారికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. బాధితులు కోలుకునేవారకూ వారికి చికిత్స అందిస్తాం. మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం.
ఎల్జీ లాంటి గుర్తింపు ఉన్న సంస్థలో ఇలాంటి దుర్ఘటనలు జరగటం బాధాకరం. గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం ఎందుకు మోగలేదో తెలియరాలేదు. మరోవైపు సంఘటన జరిగిన వెంటనే అధికారులు సమర్థవతంగా పని చేశారు. ఉదయం 4 గంటల నుంచే కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు’ అని తెలిపారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకై తొమ్మిదిమంది మృతి చెందగా, సుమారు 200మంది అస్వస్థతకు గురయ్యారు.