వ‌ల‌స‌కూలీలకు టికెట్లు అమ్మ‌డం లేదు -రైల్వేశాఖ‌

వ‌ల‌స కూలీల నుంచి టికెట్ చార్జీలు వ‌సూల్ చేయ‌డం లేద‌ని రైల్వే శాఖ స్ప‌ష్టం చేసింది.  కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇస్తున్న జాబితాలో ఉన్న వ్య‌క్తుల‌ను మాత్ర‌మే రైల్లో తీసుకువెళ్తున్న‌ట్లు రైల్వే మంత్రిత్వ‌శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసిన ఖ‌ర్చులో కేవ‌లం 15 శాతం మాత్ర‌మే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్టాండ‌ర్డ్ ఫేర్‌ను వసూల్ చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ వెల్ల‌డించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 34 శ్రామిక్ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిన‌ట్లు రైల్వేశాఖ చెప్పింది. అత్యంత సంక్షోభ స‌మ‌యంలో పేద‌ల‌ను స్వంత ఊళ్ల‌కు సుర‌క్షితంగా పంపిస్తున్నామ‌ని, త‌మ వంత సామాజిక బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నామ‌ని రైల్వే శాఖ వ‌ర్గాలు చెప్పాయి. శ్రామిక్ రైళ్ల‌లో ఉన్న బోగీల్లో కొన్ని బెర్త్‌ల‌ను ఖాళీగా ఉంచుతున్నామ‌ని, సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించాల‌న్న నేప‌థ్యంలో ఆ ప్ర‌క్రియ చేప‌ట్టిన‌ట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. కూలీల‌ను దింపిన త‌ర్వాత రైళ్లు మ‌ళ్లీ ఖాళీగా వ‌స్తున్నాయ‌ని, కూలీల‌కు ఆహారం, నీటి బాటిళ్లు అందిస్తున్న‌ట్లు రైల్వేమంత్రిత్వ‌శాఖ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న‌ది.