జూలై 8న 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు

  • నాకు ఓటు వేయని వారికైనా సరే ఇవ్వాల్సిందే 

  • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

  • గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు.. అర్హతల వివరాలూ పెట్టాలి

  • అందులో పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో సూచించాలి 

  • నేటి నుంచి 21 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాల ప్రదర్శన

  • ఇంటి స్థలం పట్టా రాలేదని అర్హత ఉన్న వారెవ్వరూ చెప్పకూడదు

  • నేడు మత్స్యకార భరోసా.. 15న రైతు భరోసా

    ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు నాకు వచ్చాయి. నేను గ్రామాల్లోకి వెళ్లి.. ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని అడిగితే.. ‘లేదు’ అని ఎవ్వరూ అనకూడదు. అర్హత ఉన్న వారెవ్వరూ కూడా ఇంటి స్థలం పట్టా లేదని చెప్పకూడదు. మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో.. దేశంలోనే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇంతటి భారీ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. 



    జిల్లా, మండల వ్యవసాయ సలహా మండళ్లు ఇచ్చే సూచనలపై రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) రైతులకు అవగాహన కలిగించి, అవి ఆచరణలో పెట్టేలా చర్యలు చేపడతాయి. కలెక్టర్లు ప్రతి రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యవసాయం మీద సమీక్ష చేయాలి. మనిషికి గుండె ఎలానో.. వ్యవసాయ రంగానికి ఆర్బీకేలు కూడా అలానే పని చేయాలి.      


    రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ముగ్గురు జేసీలను నియమిస్తున్నాం. ఇందులో ఒకరికి పూర్తిగా వ్యవసాయం బాధ్యతలు అప్పగిస్తాం. నాడు–నేడు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా గ్రామాల రూపు రేఖలు మారుస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కలెక్టర్లు తమవిగా భావించి విజయవంతం చేయాలి. అప్పుడే గ్రామాలపై మన సంతకం స్పష్టంగా కనిపిస్తుంది. 


    తుపాను మనకు ఉండకపోవచ్చని ఐఎండీ చెబుతోంది. ఇది మంచి విషయం. కాకపోతే అకాల వర్షాలు ఉండొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి.   


    సాక్షి, అమరావతి: పేదలందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అర్హులైన 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఎవరు మిగిలిపోయినా మళ్లీ అవకాశం కల్పించాలన్నారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగు నీరు, నాడు–నేడు కింద కార్యక్రమాలు, గృహ నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఉపాధి హామీ కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 


    మే 30న రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ప్రారంభం   
    ► ఈలోగా జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పడాలి 
    ► నేడు మత్స్యకార భరోసా.. 15న రైతు భరోసా  
    ► వ్యవసాయానికి ప్రత్యేకంగా ఒక జేసీ గ్రామాల రూపురేఖలు మార్చే కార్యక్రమాలన్నింటినీ కలెక్టర్లు తమవిగా భావించాలి 


     రైతు భరోసా కేంద్రాలు 
    ► ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ప్రారంభం అవుతాయి. ఈ లోగా మండల, జిల్లాస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు కావాలి. ఏ గ్రామంలో ఏ పంట వేయాలి? ఏ పంట వేస్తే మంచి రేటు వస్తుంది? అన్న విషయాలపై ఈ బోర్డులు సలహాలిస్తాయి.  
    ► రెండు మూడు రోజుల్లో మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు వస్తాయి. గ్రామ సచివాలయాల్లో ఉండే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఇచ్చే సమాచారం.. కలెక్టర్లకూ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ మాదిరిగా వస్తుంది. ప్రతి రోజూ వాళ్లు రిపోర్టులు అప్‌లోడ్‌ చేయాలి. ఆ రోజూ ఏమీ లేకపోయినా.. అప్పుడు ఉన్న యథాతథ పరిస్థితిని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  
    ► కనీస గిట్టుబాటు ధర కంటే తక్కువ రేట్లు వస్తుంటే.. గ్రామ స్థాయిలోకి వెళ్లి మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆర్బీకేలు.. విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల సరఫరా.. తదితర బాధ్యతలు కూడా తీసుకుంటాయి. ఆర్బీకేలను ముందుండి నడిపించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది.  
    ► మరో ఏడాదిలోగా జనతా బజార్లు వస్తాయి. మూడింట ఒక వంతు పంటను ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేస్తుంది. ఆర్బీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కలెక్టర్లు కల్పించాలి. 


     నేడు మత్స్యకార భరోసా 
    ► మే 6వ తేదీన మత్స్యకార భరోసా కింద సాయం అందిస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. ఎవరి పేరైనా అందులో లేకపోతే.. ఎన్‌రోల్‌మెంట్‌ ఎలా చేయించుకోవాలన్న దానిపై సమాచారం కూడా పెట్టాం.  
    ► రేపు ఎవ్వరూ నా పేరు లేదు.. ఎలా అప్లై చేయాలో తెలియడం లేదు.. అన్న మాట రాకూడదు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. పథకాల అమలులో వివక్షకు తావు లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా అన్నీ ఇస్తున్నాం 


    15న వైఎస్సార్‌ రైతు భరోసా 
    ► ఇచ్చిన మాట మేరకు ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులకు పెట్టుబడి సాయం కింద మే 15వ తేదీన వైఎస్సార్‌ రైతు భరోసా ఇస్తున్నాం. 46,69,000 మంది లబ్ధిదారులకు గత ఏడాది మొత్తం రూ.6,534 కోట్లు.. ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున ఇచ్చాం. 
    ► ఇప్పటికే రూ.2 వేల చొప్పున ఈ పథకంలో ఇవ్వగా.. మే 15న రూ.5,500 చొప్పున ఇస్తున్నాం. బ్యాంకులు తమ అప్పు కింద జమ చేసుకోలేని విధంగా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేస్తున్నాం.  
    ► రెండో విడత రూ.4 వేలు అక్టోబర్‌లో, మూడో విడత జనవరిలో సంక్రాంతి సందర్భంగా రూ.2 వేల చొప్పున ఇస్తున్నాం.  
    ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను 2 నెలల్లో ఇస్తామని చెప్పాం. ఈ నెల 22న మొదటి విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. వీటిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 


     రైతులకు క్రెడిట్, డెబిట్‌ కార్డులు 
    ► వచ్చే అక్టోబర్‌ నాటికి రైతులకు డెబిట్‌ కార్డులు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులు వీటి ద్వారా డబ్బు తీసుకోవచ్చు.. లేదా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుక్కోవచ్చు.  
    ► దీంతోపాటు రైతులకు క్రెడిట్‌ కార్డులు కూడా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. రైతు పంట వేసిన తర్వాత పంట రుణం రాలేదు అన్న మాట వినకూడదని ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోంది.  
    ► ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఇ– క్రాపింగ్‌ చేస్తారు. దీని ఆధారంగా రైతులకు బ్యాంకులు కచ్చితంగా రుణాలు ఇవ్వాలి. ఆ రుణం మీద వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద జీరో వడ్డీ వర్తిస్తుంది.  
    ► పంట రుణాలు రావడమే కాదు.. ఆ రుణాలకు సున్నా వడ్డీ కూడా వర్తింప చేయడం ఈ క్రెడిట్‌ కార్డుల ఉద్దేశం. గత ప్రభుత్వం హయాంలో సున్నా వడ్డీ పథకం లేదు. మనం దీన్ని అమల్లోకి తీసుకు వస్తున్నాం.  



     రెవెన్యూ వ్యవస్థలో మార్పు 
    ► ప్రతి జిల్లాకు ముగ్గురు జేసీలను పెడుతూ ఉత్తర్వులు ఇవ్వబోతున్నాం. ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై విధి విధానాలు కూడా పొందుపరుస్తున్నాం. ఒక జేసీకి పూర్తిగా వ్యవసాయం బాధ్యతలు అప్పగిస్తాం.  
    ► నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ఆసుపత్రులు, స్కూళ్ల అభివృద్ధి పనులు చురుగ్గా సాగేలా వీరికి బాధ్యతలు అప్పగిస్తాం.  


    గ్రామ సచివాలయాలు 
    గ్రామ సచివాలయాల్లో నిర్దేశించిన సమయంలోగా ఫలానా సర్వీసులు అందిస్తామని మనం చెప్పాం. ఆ నిర్ణీత కాలంలోగా ఆ సర్వీసులు అందాలి. కచ్చితంగా అది జరుగుతుందా.. లేదా.. అన్నది నేను పర్యవేక్షిస్తాను. దరఖాస్తు చేసినా రాలేదన్న మాట వినిపించకుండా చూసుకునే బాధ్యత కలెక్టర్లదే.  


     అర్హత ఉంటే ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందే 
    ► అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలం పట్టా ఇవ్వాలి. కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే చేద్దాం. ఎవరూ కూడా తమకు అన్యాయం జరిగిందనే మాట అనకూడదు. అర్హత ఉండీ కూడా ఇవ్వలేదనే మాట రాకూడదు. నాకు ఓటు వేయని వారికైనా సరే ఇవ్వాల్సిందే. ఈ లోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయాలి. 
    ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించాలి. అర్హతల వివరాలు కూడా పెట్టాలి. అందులో పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో కూడా వివరాలు ఉంచాలి. మే 6 నుంచి 21 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాలు ప్రదర్శించాలి. అ తర్వాత మరో 15 రోజులు వెరిఫికేషన్‌.. తర్వాత తుది జాబితా ఖరారు కోసం జూన్‌ 7లోగా తుది జాబితాను ప్రదర్శించాలి. 


      తాగునీరు 
    ► వేసవి నేపథ్యంలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవాలి. నీళ్లకు ఇబ్బందులున్న మున్సిపాల్టీలు, ఇతర ప్రాంతాలపై వెంటనే కలెక్టర్లు దృష్టి పెట్టాలి.  
    ► అనంతపురం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ తగిన చర్యలు తీసుకోవాలి.  
    ► వీలైన చోట బోర్లు, లేదంటే.. ట్యాంకర్ల ద్వారా విస్తారంగా నీటిని అందించాలి. దీనిపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. 


     విలేజ్‌ క్లినిక్స్‌ 
    ► విలేజ్‌ క్లినిక్స్‌ చాలా ముఖ్యం. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవడం ద్వారా మాత్రమే కరోనా లాంటి విపత్తులను అడ్డుకోగలం. 
    ► ఆ మేరకు చర్యలు తీసుకున్నప్పుడు 90 శాతం సమస్యలు తీరిపోతాయి. ఇందులో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర 
    పోషిస్తాయి.  


    గ్రామాల రూపురేఖలు మార్పు 
    ► ఒక గ్రామంలోకి మనం అడుగు పెట్టినప్పుడు నాడు–నేడు ద్వారా అభివృద్ధి చెందిన స్కూళ్లు.. నాలుగు అడుగులు వేస్తే నిరంతరం ఏఎన్‌ఎం ఉన్న విలేజ్‌ క్లినిక్స్, మరో నాలుగు అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం, ఇంకో నాలుగు అడుగులు వేస్తే జనతా బజార్, గ్రామ సచివాలయం కనిపించాలి. ఇవన్నీ కూడా గ్రామం రూపురేఖలను మారుస్తాయి.  
    ► విలేజ్‌ క్లినిక్స్‌కు సంబంధించి 5 వేల పైచిలుకు స్థలాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. అర్బన్‌ ప్రాంతాల్లో కూడా మ్యాపింగ్‌ చేయాల్సి ఉంది.   
    ► ఆర్బీకేల్లో కట్టాల్సిన 6,982 నిర్మాణాలకు గాను 3,000 స్థలాలను గుర్తించాలి. ఇవన్నీ మార్చి 2021 నాటికి పూర్తి కావాలి. మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యమైన కార్యక్రమం.  
    ► నాడు– నేడు కింద 15 వేలకు పైగా స్కూళ్లలో చేపట్టిన పనులు జూలై ఆఖరుకల్లా పూర్తి కావాలి. విలేజ్‌ క్లినిక్స్, స్కూళ్లలో నాడు–నేడు, ఆర్బీకేలపై ప్రతిరోజూ కలెక్టర్లు సమీక్ష చేయాలి.  
    ► ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు వీపీఆర్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  


    ఉపాధి హామీలో పని దినాలను ఇంకా పెంచాలి. కోవిడ్‌ –19 కారణంగా ఇప్పటి వరకు తక్కువగా ఉండొచ్చు. వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పని దినాలను ఎక్కువగా కల్పించాలి.