- 63 వేలకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య
- దేశవ్యాప్తంగా 7,740 కొవిడ్ దవాఖానలు
న్యూఢిల్లీ, మే 10: గడిచిన 24 గంటల్లో (శనివారం నుంచి ఆదివారం నాటికి) దేశవ్యాప్తంగా 3,277 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 62,939కి చేరింది. తాజాగా 128 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,109కి పెరిగింది. ఇప్పటి వరకు 19,357 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 30.76 శాతంగా నమోదైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, రోగుల చికిత్స కోసం అనేక చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 483 జిల్లాల్లో 7,740 ప్రత్యేక కొవిడ్-19 దవాఖానలు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ దవాఖానల్లో రోగులకు చికిత్స అందించడానికి అన్ని వసతులు ఉన్నట్లు పేర్కొంది. చికిత్స అందించడంలో భాగంగా ఈ దవాఖానలను ప్రత్యేక కొవిడ్ దవాఖానలు (డీసీహెచ్), ప్రత్యేక కొవిడ్ ఆరోగ్య కేంద్రాలు (డీసీహెచ్‌సీ), ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్ (డీసీసీసీ)లుగా విభజించామని వివరించింది.
కరోనా జాడను కనిపెడుతున్న యాప్: అమితాబ్ కాంత్
కరోనా మహమ్మారి జాడ కనిపెట్టేందుకు కేంద్రం అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ‘ఆరోగ్య సేతు’ శక్తిమంతమైన సాధనంగా ఆవిర్భవించింది. కొత్త ప్రాంతాలకు కరోనా వ్యాపించకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నది. గత నెల 2న ప్రారంభమైన ఆరోగ్యసేతు యాప్.. దేశవ్యాప్తంగా 650కి పైగా హాట్‌స్పాట్ కేంద్రాల గురించి అధికారులను అప్రమత్తం చేసిందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్ తెలిపారు. 300కి పైగా కొత్తగా తయారవుతున్న హాట్‌స్పాట్లను వెలికి తీసిందని, ఈ యాప్ లేకుంటే వాటిని గుర్తించే అవకాశం ఉండేది కాదన్నారు. కరోనాపై పోరులో ‘ఎవరికి పరీక్షలు జరుపాలి’, ‘ఎక్కడ మరిన్ని పరీక్షలు చేయాలి’ అన్న లక్ష్యాల సాధనలో ‘ఆరోగ్యసేతు’ ప్రభుత్వానికి సహాయకారిగా నిలిచిందన్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలోని 18 జిల్లాల్లో 60కి పైగా హాట్‌స్పాట్లను ఈ యాప్ గుర్తించింది. దేశవ్యాప్తంగా గత నెల 13-20 మధ్య 130 హాట్‌స్పాట్లు కొత్తగా ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ యాప్ అంచనా వేసిన ప్రాంతాలను ఆ తర్వాత 3-17 రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ‘హాట్‌స్పాట్లు’గా ప్రకటించింది. కనీసం 12,500 మందికి కరోనా పాజిటివ్ అని ఈ యాప్ తేల్చింది. సుమారు 60 వేల మందికి పొంచి ఉన్న ముప్పు గురించి తెలుపడంతోపాటు వారు పరీక్షలు చేయించుకోవడంతోపాటు సెల్ఫ్ ఐసోలేషన్, క్వారంటైన్ విధించుకునేందుకు ఆరోగ్యసేతు దోహదపడింది. ప్రస్తుతం 12 విభిన్న భాషల్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సేతు యాప్.. త్వరలో 22 భారతీయ భాషల్లోకి విస్తరిస్తున్నదన్నారు.
ప్రత్యేక కొవిడ్ దవాఖానల్లో వసతులు
- 6.56 లక్షల ఐసోలేషన్ బెడ్లు
- వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించడానికి 3.05 లక్షల పడకలు
- అనుమానిత కేసుల కోసం 3.51 లక్షల పడకలు
- 99,492 ఆక్సిజన్ వసతి గల బెడ్లు
- 34,076 ఐసీయూ పడకలు