భారత్‌లో గత 24 గంటల్లో 71 మరణాలు

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా మరణాలు అధికమవుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


భారత్‌లో గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో 71 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 2,293 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 37,336. కాగా 9,950 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారు 1,218 మంది.  మహారాష్ట్రలో అత్యధికంగా 11,506 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గుజరాత్‌లో 4,721 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 3,738 కేసులు నమోదు అయ్యాయి. 


మహారాష్ట్రలో 485 మంది, గుజరాత్‌లో 236, ఢిల్లీలో 61, మధ్యప్రదేశ్‌లో 145, రాజస్థాన్‌లో 62, తమిళనాడులో 28, ఉత్తరప్రదేశ్‌లో 42, ఏపీలో 33, తెలంగాణలో 28, పశ్చిమ బెంగాల్‌లో 33, కర్ణాటకలో 22, పంజాబ్‌లో 20, జమ్మూకశ్మీర్‌లో 8, కేరళ, హర్యానాలో నలుగురు చొప్పున, బీహార్‌, జార్ఖండ్‌లో ముగ్గురి చొప్పున, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇద్దరు, ఒడిశా, ఉత్తరాఖండ్‌, అసోం, మేఘాలయలో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో మృతి చెందారు.