విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకేజీ కావడంతో ఆ పరిసర ప్రాంతాలన్ని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే 8 మంది చనిపోగా, 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమకు మూడు కిలోమీటర్ల పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురం, పద్మాపురం, బీసీ కాలనీ, కంపరపాలెం గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గ్రామాల పరిధిలోని సుమారు 2 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.
పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా వివరాల ప్రకారం.. 100 నుంచి 200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. శ్వాస సమస్యలతో బాధపడుతున్నారని, పలువురు వాంతులు చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బాధితులందరినీ విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు. ఇండ్లలోనే చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి.. వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ కావడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ బాధితుల కోసం అదనంగా 300 బెడ్లు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. భారత నౌకాదళం, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
స్థానిక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయినట్లు వార్తలు వచ్చాయన్నారు. తక్షణమే పోలీసులు ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి ప్రజలను అప్రమత్తం చేశారని తెలిపారు. త్వరగా ఇళ్లను ఖాళీ చేయాలని పోలీసులు ప్రకటించారని పేర్కొన్నారు. ఘటనాస్థలికి అంబులెన్స్‌లు, ఆర్టీసీ బస్సులను తరలించి.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక వ్యక్తి తెలిపారు.