విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన : ముగ్గురు మృతి.. 200 మందికి అస్వస్థత

విశాఖపట్నం : నగరంలోని గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఈ ఘటనతో ఒక్కసారిగా 3 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. ఈ రసాయన వాసనకు కళ్లు మండి కడుపులో వికారంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. ఎల్జీ పాలిమర్స్‌, ఆర్‌.ఆర్‌ వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలు మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలువరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


ముగ్గురు మృతి..


కాగా.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా లీకేజీ అదుపులోకి రాలేదు. దీంతో ఎల్జీ పాలిమర్స్‌, వెంకటాపురం పరిసరాల్లో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్నారు. ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌లు మోగిస్తూ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఎల్జీ పాలిమర్స్‌ ప్రభావిత ప్రాంతాలను మంత్రి అవంతి శ్రీనివాస్‌, డీఎస్పీ ఉదయ్‌భాస్కర్‌ సందర్శించారు. ఈ క్రమంలో ఉదయ్ భాస్కర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.


మరో 2 గంటలు పట్టొచ్చు..


ఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ హుటాహుటిన స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో 2 గంటలు పట్టొచ్చని వెల్లడించారు. సుమారు 200 మంది అస్వస్థతకు గురైఉంటారుని ఆయన తెలిపారు. యంత్రాలను ప్రారంభించే సమయంలో మంటలు వచ్చాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.