కరోనా వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం దూకుడుగా, వ్యూహాత్మకంగా కరోనా పరీక్షలు చేపట్టాలన్నారు. దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్, నాన్-హాట్‌స్పాట్ జోన్లు ఉండాలని సూచించారు. కోవిడ్19పై రాహుల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌తో కేవలం స్వల్ప కాలం మాత్రమే వైరస్‌ను నియంత్రించగలమని, కానీ టెస్టింగ్‌ను పెంచి, దాన్ని వెంటాడితేనే తప్ప ఆ వైరస్ నుంచి శాశ్వత విముక్తి దక్కదన్నారు. దేశంలో ప్రస్తుతం టెస్టింగ్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని రాహుల్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలను దూకుడు రీతిలో చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచన చేశారు. తన వ్యాఖ్యలను విమర్శలుగా స్వీకరించరాదు అని ఆయన అన్నారు.
ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. వైరస్‌ను ఓడించాలంటూ దేశ ప్రజలు కూడా సంఘటితం కావాలన్నారు. గత కొన్ని నెలల నుంచి దేశ, విదేశీ నిపుణులతో వైరస్ గురించి చర్చించానని, వారి చెప్పిన విషయాలను మీకు విన్నవిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. వైరస్ పరీక్షలు నిర్వహిస్తేనే, అప్పుడు ఎవరినైనా ఐసోలేట్ చేయడం వీలవుతుందన్నారు. మన టెస్టింగ్ రేటు కేవలం 199-మిలియనగా ఉన్నట్లు రాహుల్ చెప్పారు. ఇది జిల్లాకు 350గా ఉన్నట్లు పేర్కొన్నారు.