న్యూఢిల్లీ: ప‌్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండగలిగేలా కరోనా గొప్ప గుణపాఠం నేర్పిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు కృషిచేస్తున్న సర్పంచులందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలతో పురస్కారాలు పొందిన సర్పంచులను అభినందించారు.
ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందుబాటులో ఉంచాలని సర్పంచులకు సూచించారు. విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఎంతో కృషి చేస్తోందని, పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయని ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పిందని, కష్టం సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండటం ఎలాగో ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై గ్రామ ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని సర్పంచుకులకు సూచించారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రధాని ప్రారంభించారు.