ఏపీలో ఒడిశా యువ‌తి ఆత్మ‌హ‌త్య

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తూర్పుగోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం వడ్లమూరు రోడ్డులోని అపెక్స్‌ రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న 24 ఏండ్ల‌ యువతి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన మాడపల్లి పద్మ ఒడిశాకే చెందిన మ‌రో ముగ్గురు యువ‌తుల‌తో క‌లిసి బ‌తుకుదెరువు కోసం ఏపీకి వ‌చ్చింది. అంద‌రితో క‌లిసి అపెక్స్ రొయ్య‌ల పరిశ్రమలో కార్మికురాలిగా ప‌నిచేస్తున్న‌ది.  


అయితే ప‌ద్మ‌కు సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ బుధ‌వారం ఫాక్యరీలో విధుల్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదిలావుంటే పద్మ ఉరికి వేలాడుతుండ‌టం చూసి ఒడిశాకు చెందిన ఆమె స‌హ‌చ‌రులు సోనాలి, మ‌నీషా, గంగీ షాక‌య్యారు. సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. దీంతో స్థానికులు వారిని పెద్దాపురం ఏరియా ఆస్ప‌త్రికి తరలించారు. కాగా, పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.