- గణనీయంగా తగ్గిన చావులు
- ఆగిన పరుగులు.. పదిలమైన జీవితాలు
- ప్రమాదాలు లేవు.. నేరాలు ఘోరాలు లేవు
- తాగుడు తగ్గింది.. తాగినాక లొల్లి తగ్గింది
- గణనీయంగా తగ్గిన మరణాలు
రాష్ట్రంలో మనిషి ప్రశాంతంగా ఉంటున్నాడు. లాక్‌డౌన్ పుణ్యమా అని ఉరుకుల పరుగుల జీవితాలకు బ్రేక్ పడింది. ఒత్తిళ్లు తగ్గిపోయాయి. రకరకాల జబ్బులు పారిపోతున్నాయి. మద్యంలేదు.. మత్తెక్కడాలూ లేవు. రోడ్డు ప్రమాదాలు లేవు.. ఆత్మహత్యలు లేవు. రాష్ట్రంలో అర్ధ్ధంతర మరణాలకు కామా పడింది. ఆయుష్షు తీరినవారు తప్ప అకాల మరణాలు ఆగిపోయాయి. శ్మశానవాటికలకు వచ్చే మృతదేహాల సంఖ్య తగ్గిపోయింది. నెల రోజులుగా ప్రజలు ఇండ్లకే పరిమితమై ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటుపడటంతో మృత్యువుకు కొంత విరామం దొరికినట్లయింది. కంప్యూటర్లు, కాంక్రీటు గోడలు.. వాహనాల రొదలు.. గాలి, ధ్వని, జల కాలు ష్యం బంద్ అయిపోయాయి. అన్నింటికీ మిం చి కుటుంబంతో పూర్తికాలం గడిపే అత్యంత అరుదైన అవకాశం లభించింది. మానసిక ప్రశాంతత లభించింది. జంక్‌ఫుడ్ తినడం ఆగిపోయింది. ఇంట్లోనే పప్పో.. కారమో వండుకొని వేళకు తింటున్నారు. వేళకు పడుకొంటున్నారు. ఆరోగ్యాలు కుదుటపడ్డాయి. కుటుంబమంతా కలిసి జీవించడం వల్ల బలవన్మరణాలు ఆగిపోయాయి. ప్రాణం విలువ ఏపాటిదో కరోనా వైరస్ అందరికీ ఒక్కసారి గుర్తుచేసింది.
తగ్గిన రోడ్డు ప్రమాదాలు
లాక్‌డౌన్ నాటినుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జరిగిన కొన్ని ప్రమాదాలకు కూడా మితిమీరిన వేగమే కారణం. మరోవైపు మ ద్యం అమ్మకాలను నిషేధంతో తాగి వాహనాలను నడపడం ద్వారా జరిగే ప్రమాదాల సంఖ్య తగ్గింది. మార్చి 26న ఒక్క ప్రమాదం జరుగకపోవడం రికార్డు. హైదరాబాద్‌లో మార్చిలో 15 మంది చనిపోగా.. ఏప్రిల్‌లో ఇద్దరే చనిపోయారు.
శ్మశానవాటికల్లో నిశ్శబ్దం..
మునుపెన్నడూ లేనివిధంగా శ్మశానవాటికల్లో అంత్యక్రియల సంఖ్య బాగా తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరిలో ఒక్కో శ్మశానవాటికలో రోజుకు సగటున పది నుంచి పదిహేను అంత్యక్రియలు జరిగేవి. ఇప్పుడు ఒకటి రెండుకు మించి జరుగటంలేదు. హైదరాబాద్‌లో ప్రముఖ మహాప్రస్థానంలోకి వివిధ దవాఖానల నుంచి కూడా ఒక్క మృతదేహం రావడంలేదు. ఈఎస్‌ఐ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో రోజూ పదినుంచి పదిహేను అంత్యక్రియలు జరిగేవి. గత ఐదురోజుల్లో మూడు అంత్యక్రియలు జరిగితే.. వాళ్లూ వృద్ధులే. మరోవైపు, లాక్‌డౌన్‌తో మనుషుల్లో దయాగుణం పెరిగింది. కరోనా వేళ పలువురు బృందంగా ఏర్పడుతూ అనాథలు, ఆర్తులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
నిమ్మలంగ ఉంటున్నరు
లాక్‌డౌన్ మొదలైనప్పట్నుంచి శవాలు రావడం తగ్గిపోయాయి. ప్రజలంతా ఇంటికాడ్నే నిమ్మలంగా ఉంటున్నరు. తాగి గొడవకు పోతలేరు. ఎండాకాలం మొదలైందంటే తాగేటోళ్లు రోజుకు ముగ్గురు, నలుగురు సచ్చిపోయేటోళ్లు. ఇప్పుడు మందు లేకపోవడంతో కుదుటపడ్డరు. ఆత్మహత్యలు, మొగుడు, పెండ్లాం కొట్లాటలు అసలే లేవు. సచ్చేటోళ్లు కూడా తగ్గిపోయిండ్రు.
- యాదగిరి, హిందూ శ్మశానవాటిక
శానా తగ్గినయి
రోజుకు నాలుగై దు శవాలను కాల్చెటోళ్లం. ఇప్పుడైతే కట్టెలు పక్కనేసినం. చావులు తగ్గినయి. ఇది మంచిదే. వయ స్సు మీద పడి సచ్చిపోయేటోళ్లు ఉంటున్నరు తప్ప సంపుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం, యాక్సిడెంట్ అయి సచ్చిపోవడం వంటివి లేవు. అప్పుడు దవాఖానల నుంచి కూడా శవాలు వచ్చేవి. కానీ ఇప్పుడు దవాఖానల సచ్చిపోయిండ్రని ఒక్కటి కూడా రాలేదు.
- నందు, మూసాపేట్ శ్మశానవాటిక
హిందూ శ్మశానవాటిక (ఈఎస్‌ఐ దవాఖాన దగ్గర)
ఫిబ్రవరి నెల మొత్తం : 178 శవాలు
మార్చి నుంచి ఏప్రిల్ : 104 శవాలు
ఏప్రిల్ 1 నుంచి 21 వరకు : 14 శవాలు
మూసాపేట్ శ్మశానవాటిక ( కూకట్‌పల్లి)
మార్చి నుంచి ఏప్రిల్ వరకు : 28 శవాలు
ఏప్రిల్ 1 నుంచి 20 వరకు : 7 శవాలు
వరంగల్ శివముక్తిధామ్ శ్మశానవాటిక ( హన్మకొండ )
మార్చి నుంచి ఏప్రిల్ : 43
ఏప్రిల్ 1 నుంచి 20 వరకు : 11
రోడ్డుభద్రత అథారిటీ లెక్కల ప్రకారం ప్రమాదాల వివరాలు
సమయం | మరణాలు | గాయాలు |
మార్చి1 నుంచి 22 వరకు | 52 | 148 |
ఏప్రిల్ 1 నుంచి 21 వరకు | 23 |
(ఇవన్నీ మితిమీరిన వేగం వల్ల జరిగినవి)
రోజువారీ ప్రమాదాల వివరాలు
సగటున ప్రమాదాల సంఖ్య | మరణాలు | గాయాలు | మొత్తం మరణాలు | |
గతేడాది | 60 | 19-22 | 80 | 6964 |
ఈ ఏడాది (మార్చి వరకు) | 20 | 17 | - | 1538 |
లాక్‌డౌన్ అనంతరం | 3 | 23 | - | 23 |