కేసుల పెరుగుదలఅస్థిరంగా లేదు

  • లాక్‌డౌన్‌తో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట 

  • నిర్ధారణ పరీక్షల్ని పెంచాం: సీకే మిశ్రా


: దేశంలో కరోనా కేసుల పెరుగుదల అస్థిరంగా లేదని, పట్టపగ్గాలు లేకుండా కేసులు పెరుగకపోవడం ఊరట కలిగించే అంశమని కేంద్రం పేర్కొంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తున్నదని వెల్లడించింది. ముప్పై రోజుల లాక్‌డౌన్‌ కాలంలో కరోనా సంక్రమణను అడ్డుకున్నామని, వైరస్‌ వ్యాప్తిని తగ్గించామని తెలిపింది. ఈ సమయంలోనే వైరస్‌ కేసులు రెట్టింపయ్యే వేగం కూడా మందగించిందన్నది. ఈ వివరాల్ని సాధికార కమిటీ-2 ఛైర్మన్‌ సీకే మిశ్రా గురువారం వెల్లడించారు. దేశంలో కొవిడ్‌-19 వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని గణనీయంగా పెంచామని ఆయన తెలిపారు. ఒక వ్యక్తికి వైరస్‌ సోకిందో లేదో నిర్ధారించే కీలకమైన ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్ని లాక్‌డౌన్‌ కాలంలో పెద్దయెత్తున నిర్వహించామన్నారు. మార్చి 23 నాటికి దేశవ్యాప్తంగా 15 వేల ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్ని నిర్వహిస్తే, ఏప్రిల్‌ 22 నాటికి వీటి సంఖ్య 5 లక్షలకు చేరుకున్నదని తెలిపారు. ఈలెక్కన లాక్‌డౌన్‌ కాలంలో ఈ పరీక్షలు 33 రెట్లు పెరిగాయన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరీక్షలు ఎంతమాత్రం సరిపోవన్న విషయం తమకు తెలుసునని, మరిన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ‘కొవిడ్‌-19 కేసుల్లో స్థిరమైన పెరుగుదల నమోదవుతున్నది. పట్టపగ్గాలు లేకుండా కేసులు పెరుగడం లేదు. దీన్నిబట్టి వైరస్‌ను కట్టడి చేయడంలో అమలు పర్చిన వ్యూహాలు సత్ఫలితాల్ని ఇస్తున్నాయని అర్థమవుతున్నది. లాక్‌డౌన్‌ను విధించిన తర్వాత కొత్త కేసులు 16 రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు 24 రెట్లు పెరిగాయి’ అని వెల్లడించారు. కరోనా రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దవాఖానల సంఖ్య 3.5 రెట్లు పెరిగాయని, ఐసోలేషన్‌ పడకల సంఖ్య 3.6 రెట్లు పెరిగాయని మిశ్రా వివరించారు.


23 వేల చేరువలో కేసులు


దేశంలో కరోనా కేసుల సంఖ్య గురువారంనాటికి 22,951కి చేరుకున్నది. వివిధ రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రకటించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 38 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య 721కి చేరుకున్నది. గత 24 గంటల్లో కొత్తగా 1,658 వైరస్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 4,700 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.   


15.40 కోట్ల క్లోరోక్విన్‌ మాత్రల సరఫరా


కరోనా చికిత్స కోసం ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 15.40 కోట్ల హైడ్రాక్సిక్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) మాత్రల్ని ప్రభుత్వం సరఫరా చేయబోతున్నదని  ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇందులో 7.5 కోట్ల మాత్రల్ని రిటైల్‌ ఫార్మసీలకు, 6.75 కోట్ల మాత్రల్ని కేంద్రానికి, 80 లక్షల మాత్రల్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, 45 లక్షల మాత్రల్ని ఈఎస్‌ఐసీ, బీపీపీఐ వంటి ప్రభుత్వ సంస్థలకు అందించనున్నట్టు ఆ అధికారి వెల్లడించారు.