- లాక్‌డౌన్‌ను నీరుగార్చిన కేంద్ర ప్రభుత్వం
- ఇటుకబట్టీలు మొదలు రియల్టీ దాకా అనుమతులు
- అదే జరిగితే.. 20 తర్వాత లాక్‌డౌన్ అమలు కష్టమే
- పెద్ద ఎత్తున ప్రజలు బయటకు.. నిర్ణీత దూరం ఎలా?
లాక్‌డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అశ్వత్థామ హతః అని పెద్దగా అరిచి, కుంజరః అని చిన్నగా చెవిలో చెప్పినట్టుంది! వచ్చేనెల 3 దాకా లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధానమంత్రి మోదీ ప్రకటించి 24 గంటలైనా గడవకముందే కేంద్రం.. అందుకు పూర్తి భిన్నంగా.. లాక్‌డౌన్‌ను నీరుగార్చేలా ‘మార్గదర్శకాలు’ విడుదల చేసింది. వీటిని గనుక ఉన్నదున్నట్టుగా అమలు చేస్తే.. లాక్‌డౌన్ 20న దాదాపు ముగిసిపోయినట్టే!
ఇటుక బట్టీలు మొదలుకుని, రియల్టీ దాకా అనేకచోట్ల పనులు నిర్వహించుకునేందుకు కేంద్రం అనుమతించింది. జనసందోహాలు, జనసంచారం అవసరమైన పలు రంగాలకు తలుపులు తెరుస్తూనే.. ‘అయితే నిబంధనల ప్రకారం నిర్ణీత దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించాలి’ అనే షరతుతో సరిపెట్టింది. ఒకవైపు లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడే జనం ఆగడం లేదు. మరిప్పుడు జన సంచారానికి అనుమతిస్తే.. కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి తక్కువున్న ప్రాంతాలకు వైరస్ వ్యాపించదా? అన్న అనుమానం రేకెత్తుతున్నది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమనీ, దేశమంతా ఒకేతాటిపై ఉండి అమలుచేయడమే పరిష్కారమని పలు రాష్ర్టాలు ముక్తకంఠంతో కోరగా.. అవసరమైతే రాష్ర్టాలు సొంతంగా కఠిన నిబంధనలు విధించుకోవచ్చని కేంద్రం ముక్తాయించింది. లాక్‌డౌన్ మినహాయింపుల విషయంలో అనూహ్య వేగంతో నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రాష్ర్టాలకు అత్యంత కీలకమైన ఆర్థిక సహాయం విషయంపై మాత్రం పెదవి విప్పలేదు. కేంద్రం వద్ద కూడా డబ్బులు లేని ఈ తరుణంలో రాష్ర్టాలను గట్టెక్కించేందుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు, పలు ప్రతిపాదనలు చేశారు. ఒకవైపు పలు ప్రపంచ దేశాలు ఆర్థిక గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కానీ ఈ దిశగా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. మాటలు కోటలు దాటుతున్నా రూపాయి ఢిల్లీ దాటడం లేదు. రాష్ర్టాలకు తాము ఏమివ్వగలమో, ఎలాంటి వెసులుబాటు కల్పించగలమో ఒక్క మాట కూడా కేంద్రం చెప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మోదీ చెప్పిన సప్తపది అమలు సంగతేమోగానీ.. ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అష్టకష్టాలు మాత్రం తప్పకపోవచ్చు!
కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసిన మార్గదర్శకాలు అన్ని వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కఠినంగా తీసుకొంటున్న చర్యలను నీరుగారుస్తున్నట్లున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితులను పణంగాపెట్టి.. కఠినంగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టవన్నట్టుగా పలు రంగాలకు మినహాయింపులు ప్రకటించింది. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలతో.. పలు రంగాల్లో లాక్‌డౌన్ ఎత్తివేసినట్లయింది. మినహాయింపులు ఇచ్చిన వాటిలో పలు పరిశ్రమలు కార్పొరేషన్ పరిధి దాటి గ్రామీణ పరిధుల్లో ఉన్నాయి. రోడ్డువైపు దాబాల నుంచి ఈ కామర్స్ కంపెనీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు వంటి వ్యక్తి ఆధారిత సర్వీసులు, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 50 శాతం ఉద్యోగులకు అనుమతి వల్ల.. లాక్‌డౌన్ అన్నది పూర్తిగా నామమాత్రమవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ను ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 30 వరకు కఠినంగా కొనసాగించాలనే యోచిస్తున్నట్లు సమాచారం. దేశంలో వైరస్ తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపించడంలేదు. రోజుకు 700 నుంచి వెయ్యి కేసులు పాజిటివ్‌గా నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 30 నుంచి 40 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన మార్గదర్శకాలు విడుదల చేయడం వల్ల వైరస్ వ్యాప్తికి అవకాశమిచ్చినట్లే అవుతుంది తప్ప.. నియంత్రణకు కాదని వివిధ వర్గాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే చైనా, దక్షిణ కొరి యా వంటి దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసి తిరిగి కొనసాగించాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా పలు రంగాలకు సడలింపులు ప్రకటించడం ఒక విధంగా లాక్‌డౌన్ ఎత్తివేయడంలాంటిదేనని నిపుణులు అంటున్నారు.
రాష్ర్టాల కోర్టులోకి బంతి
సామాజిక దూరాన్ని పాటిస్తూనే లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు పాక్షికంగా ద్వారాలు తెరవడం వల్ల చాలామంది ప్రజలు ఇండ్లనుంచి బయటకు వస్తారు. అప్పుడు మే 3 వరకు లాక్‌డౌన్ ఉండీ లేనట్లే అవుతుంది. ఈ మార్గదర్శకాల అమలు విషయంలో రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్వేచ్ఛనివ్వడంద్వారా బంతిని వాటి కోర్టుల్లోకి కేంద్రం తోసేసింది. ఇకపై ఏ విపరిణామం సంభవించినా దాని బాధ్యత ఆయా రాష్ర్టాలపైకి నెట్టివేయడానికి అవకాశం వస్తుంది. నిజానికి దేశంలో వైరస్ బయటపడ్డ చాలాకాలానికిగానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. జనవరి 31న కేరళలో మొదటి కేసు బయటపడింది. మార్చి 22 న గానీ దేశంలో లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రకటించలేదు.
వ్యవసాయానికి ఊరట
లాక్‌డౌన్‌నుంచి వ్యవసాయానికి వెసులుబాటు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఫార్ములాను అనుసరించింది. వరి కోతలకు కీలక సమయమని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దాదాపు 7 వేలకు పైగా కోత మిషన్లను సమకూర్చేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాలలోని కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా మెషనరీలు తిరగడానికి అనుమతిచ్చారు. ఇదే విషయాన్ని కేంద్రం ఇప్పుడు ప్రకటించింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కోతలకు కూలీలను తీసుకొనే అవకాశం పెరుగనున్నది. మార్కెట్ల ద్వారా నేరుగా రైతుల నుంచి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కో-ఆపరేటివ్స్ ద్వారా గ్రామాల నుంచి సేకరణ వ్యవస్థలకు మినహాయింపు కల్పించింది.
ఇలాగైతే లాక్‌డౌన్ అమలు ఎట్లా ?
1. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మోటర్ మెకానిక్, కార్పెంటర్, ఐటీ సంబంధ మరమ్మతులు చేసేవారు పనులు చేసుకోవచ్చు.
2. నిర్మాణ రంగ పనులను స్థానిక కూలీలతో చేసుకోవచ్చు.
3. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు పనిచేయొచ్చు.
4. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (స్పెషల్ ఎకనమిక్ జోన్-ఎస్‌ఈజడ్), పారిశ్రామిక ప్రాంతా లు, పారిశ్రామిక్ టౌన్‌షిప్పుల్లోని పరిశ్రమలను నడుపొచ్చు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి రవాణా సదుపాయం కల్పించవచ్చు.
5. ఉపాధి హామీ పనులను నిర్వహించుకోవచ్చు. సాగునీటిపారుదల, నీటినిర్వహణ పనులు చేసుకోవచ్చు.
6. హైవేలపై ట్రక్కులు రిపేర్ దుకాణాలు, హైవే దాబాలను నిర్వహించుకోవచ్చు
7. ఐటీ, ఐటీ సంబంధ రంగాలు 50 శాతం మంది ఉద్యోగులతో పనిచేయొచ్చు.
8. ఈ-కామర్స్ (ఆన్‌లైన్ స్టోర్)లు, వాటికి సంబంధించిన వాహనాలను సంబంధిత అధికారుల అనుమతితో నడుపవచ్చు.
9. గ్రామీణ ప్రాంతాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పనిచేసుకోవచ్చు.
10. ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి పరిశ్రమలు పనిచేయవచ్చు.
11. ఇటుకబట్టీలు నడుపవచ్చు.
12. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు పనులు చేసుకోవచ్చు, పరిశ్రమలకు సంబంధించిన అన్ని పనులు నిర్వహించుకోవచ్చు.
13. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవచ్చు.
14. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పరిమిత సంఖ్యలో పనిచేసుకోవచ్చు. గ్రూప్ ఏ, గ్రూప్ బీ అధికారులు అవసరాన్నిబట్టి రావాలి. గ్రూప్ సీ, వారికన్న తక్కువ క్యాడర్ ఉద్యోగులు వారి సంఖ్యనుబట్టి ఉన్నవారిలో 33 శాతం వరకు విధులకు హాజరుకావాలి.
15. కలెక్టర్ అనుమతితో వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చు.