న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలడంతో దేశమంతా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా దెబ్బతిన్నది. దీంతో కేంద్రంతో పాటు ఆయా రాష్ర్టాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం(డీఏ)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో డీఏపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర కేబినెట్ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. పెంచిన 4 శాతం డీఏకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరువు భత్యం పెంపును నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత కరువు భత్యం ఇచ్చే విషయాన్ని కేంద్రం ఆలోచించే అవకాశం ఉంది. అయితే పెంచిన డీఏను బకాయిల రూపంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సమకూర్చే అవకాశం ఉంది.
కేంద్రం ఒక వేళ కరువు భత్యాన్ని ఆపితే.. 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారులపై ప్రభావం పడనుంది. ఇప్పుడు పెంచిన కరువు భత్యాన్ని అమలు చేస్తే కేంద్రంపై రూ. 14,595 కోట్ల భారం పడనుంది.