రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్ భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్..దీనిపై ప్రకటన చేశారు. జియో ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టనున్నామని, కొన్ని కీలక ప్రాజెక్టులపై పనిచేయనున్నామని, దీంతో భారత్‌లో వాణిజ్య అవకాశాలు మెరుగయ్యే ఛాన్సు ఉన్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ను ఎక్కువ సంఖ్యలో భారతీయులు వాడుతున్నారని, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కూడా వీటిని వినియోగిస్తున్నారన్నారు. దేశం ప్రస్తుతం డిజిటల్ మార్పు దశలో ఉందన్నారు. లక్షల సంఖ్యలో భారతీయులను, వ్యాపారవేత్తలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చేందుకు జియో కీలక పాత్ర పోషించిందని జుకర్‌బర్గ్ తెలిపారు.
చిన్నవ్యాపారులే ఆర్థిక వ్యవస్థలో కీలకమని, అలాంటి వారికి మద్దతు ఇవ్వాలని, భారత్‌లో సుమారు 6 కోట్ల మంది చిన్న వ్యాపారులు ఉన్నారని, వారిపై లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఆధారపడుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధనాల అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. కస్టమర్లకు, వ్యాపారవేత్తలకు హెల్ప్ చేసేందుకు మేం జియోతో జతకట్టామని జుకర్‌బర్గ్ తెలిపారు. భారత వ్యాపారులకు, ప్రజలకు కొత్త అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ముఖేశ్ అంబానీ, జియో టీమ్ మొత్తానికి జుకర్‌బర్గ్ థ్యాంక్స్ చెప్పారు.