- అమెరికన్ల ఉద్యోగాలను రక్షించేందుకే..
- ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయబోతున్నా
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
- భారత్‌కు పెద్ద దెబ్బేనంటున్న నిపుణులు
వాషింగ్టన్, ఏప్రిల్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇన్నాళ్లూ వీసా నిబంధనలను అడ్డగోలుగా మార్చిన ఆయన.. ఇప్పుడు వలసలపై తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్టు ప్రకటించారు. ‘ఓ అదృశ్య శక్తి దాడి నేపథ్యంలో.. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికాలోకి తాత్కాలికంగా వలసలను నిషేధించే ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయబోతున్నా’ అని ట్రంప్ సోమవారం ట్వీట్ చేశారు. ఈ ఉత్తర్వులు గనుక కార్యరూపం దాల్చితే కొంతకాలం పాటు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ, హెచ్4 వంటి వాటిపైనా నిషేధం విధించవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం భారత్, చైనాకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది.
పెరుగుతున్న నిరుద్యోగం
కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అవుతున్నది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. దాదాపు 2.2 కోట్ల మంది యువత ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార రిపబ్లికన్లు చెప్తున్నారు.
అధ్యక్షుడిగా ట్రంప్ విఫలం: కమలాహారిస్
విపక్ష డెమోక్రాటిక్ పార్టీ నేతలతోపాటు వలసదారుల తరఫు లాయర్లు ట్రంంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్ సెనెటర్ కమలా హారిస్ స్పందిస్తూ.. ‘ప్రస్తుత పరిస్థితులను ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా వీసా నిబంధనలను కఠినతరం చేయాలని చూస్తున్నారు’ అని విమర్శించారు. కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని, ఆయన నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, వలసదారులపై తన కక్షను తీర్చుకునేందుకు కరోనాను ఒక సాకుగా వాడుకుంటున్నారని నేషనల్ ఇమ్మిగ్రేషన్ ఫోరం డైరెక్టర్ అలి నూరానీ విమర్శించారు. ఈ నిర్ణయం ద్వారా ట్రంప్ అమెరికా ప్రజల్లో విద్వేషాన్ని నింపుతున్నారని మండిపడ్డారు.
మొదటి నుంచీ ఇంతే..
అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాననే హామీతోనే ట్రంప్ గద్దెనెక్కారు. అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి వలసలను కట్టుదిట్టం చేశారు. ప్రతిభ ఆధారిత వీసా చట్టాన్ని తీసుకొచ్చారు. దేశాలకు కోటా విధించారు. చైనా, ఐరోపా, కెనడా, మెక్సికో వంటి దేశాల నుంచి వచ్చే వలసలపై నియంత్రణ విధించారు. మెక్సికో సరిహద్దులో ఏకంగా గోడ కడుతున్నారు.