- ఎమ్మెల్యే రాచమల్లు చొరవతో పెరిగిన పరీక్షల సంఖ్య
- మొబైల్ టెస్టింగ్ వ్యాన్లు ఏర్పాటు
ప్రొద్దుటూరు :కరోనా వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రొద్దుటూరులో ఎక్కువగా శాంపిల్స్ పరీక్షించేలా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఆయన సూచన మేరకు మంగళవారం ఇందుకోసం రెండు మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఒక్కరోజే 200 మందికి పరీక్షలు చేయగలిగారు. ఈ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలో ఇప్పటివరకూ 21 పాజిటీవ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే మరింత అప్రమత్తమై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా కలెక్టర్ హరికిరణ్‌తో చర్చించారు. దీంతో కడప రిమ్స్‌తోపాటు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో ట్రూనాట్ సెంటర్‌లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కువమందిని రోజూ పరీక్షించి త్వరితగతిన వ్యాధిని నిర్ధారిస్తే తర్వాత చికిత్స చేయించవచ్చునని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో మూడు షిఫ్ట్‌లు పనిచేయించాలని సూచించారు. కేసులు పూర్తయ్యేవరకూ మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను ఇతర ప్రాంతాలకు మళ్లించవద్దని అధికారులకు సూచించారు.
రోజూ 200 నుంచి 250 మందిని పరీక్షిస్తే వారం రోజులకు అనుమానితులందరినీ పరీక్షించవచ్చునని రాచమల్లు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే సూచన మేరకు మంగళవారం ప్రజలు పెద్ద ఎత్తున పరీక్షలు చేయించుకొనేందుకు ముందుకొచ్చారు.. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శాంతికళతోపాటు వైద్యాధికారులు కిషోర్, ఖలందర్‌తో ఎమ్మెల్యే పరీక్షలపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, ఎంపీడీఓ, తహశీల్దార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌లతో కూడా నిత్యం సమీక్షిస్తున్నారు. పరీక్షా ఫలితాలు రావడానికి జాప్యం జరగరాదన్నారు. రెడ్‌జోన్ పరిధిలో పరీక్షలు వేగవంతం చేయకపోతే ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడతారని రాచమల్లు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే ఒకేమారు మూడుచోట్ల పరీక్షలు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. తన వినతి మేరకు ప్రొద్దుటూరులో ట్రూనాట్ సెంటర్ ఏర్పాటు చేసిన సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం సమీక్షలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం,డీఎస్‌పీ సుధాకర్, ఒన్‌టౌన్ సీఐ నాగరాజు పాల్గొన్నారు.
నేటి నుంచి పసుపు కొనుగోళ్లు
కడప అగ్రికల్చర్ : ప్రభుత్వ మద్దతు ధరతో బుధవారం నుంచి పసుపు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. గురువారం డిప్యూటీ సీఎం అంజద్‌బాష కడప మార్కెట్‌యార్డులోనూ, మైదుకూరు కేంద్రంలోనూ కొనుగోళ్లను ప్రారంభిస్తారని డీసీఎంఎస్ చైర్మన్ గోపి, మార్కెటింగ్ మేనేజర్ మహబూబ్‌పీరా తెలిపారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో 10 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగు చేయగా ఈ పంట నుంచి 1.80 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు ఉద్యానశాఖ అంచనాలు వేసిందన్నారు. క్వింటా రూ.6850 మద్దతు ధరతో కొనుగోలు చే యాలని చెప్పిందన్నారు. రాజంపేట, కడ ప, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, చాపాడు ప్రాంతాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని అన్నారు.
నిత్యం పరీక్షలు వేగవంతం