ఒక్కడి నుంచి 80 మందికి

  • సూర్యాపేటలో కరోనా స్వైరవిహారం

  • మర్కజ్‌ యాత్రికుడి నుంచి అంటుకొన్న మహమ్మారి

  • పల్లెలకూ విశృంఖలంగా వ్యాప్తి

  • కూరగాయల మార్కెట్‌నుంచి జిల్లా అంతటికీ విస్తరణ

  • మంగళవారం తాజాగా 26 పాజిటివ్‌ కేసులు నమోదు

  • జిల్లాలో 80కి చేరిన కేసులు

  • మరింత కట్టుదిట్టం చేయాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలు


ఒక్కడి నిర్లక్ష్యం.. సూర్యాపేటకు పెనుశాపంగా మారింది. అప్పటివరకు కరోనాకు దూరంగా.. ప్రశాంతంగా ఉన్న జిల్లాను కలచివేసింది. మర్కజ్‌లో అతణ్ణి అంటిపెట్టుకొని వచ్చిన వైరస్‌ స్వైరవిహారంచేసింది. ఏకంగా ఎనభై మందిని పట్టుకొన్నది. నగరం నుంచి పల్లె పల్లెకూ పాకిపోయింది. ఇంకెంతమందికి విస్తరిస్తుందో తెలియనంత భయంకరంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ ఒక్క జిల్లాలోనే కొద్ది రోజులుగా పెద్దసంఖ్యలో కేసులు పాజిటివ్‌గా తేలుతున్నాయి. క్వారంటైన్లకూ.. కంటైన్మెంట్లకూ కట్టడికానంత రీతిలో విజృంభిస్తున్నది. ఒక్క కేసుకూడా లేకుండా ఉన్న జిల్లాలో పదుల సంఖ్యలో గొలుసుకట్టులా వైరస్‌ విస్తరిస్తున్న తీరు విస్మయపరుస్తున్నది. 


మార్చి 17న సూర్యాపేటలోని కుడకుడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని తిరిగివచ్చాడు. అప్పటికి సూర్యాపేటలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంతా ప్రశాంతంగా ఉన్నది. కరీంనగర్‌లో ఇండోనేషియా పౌరులకు పాజిటివ్‌తో వెలుగులోకి వచ్చిన మర్కజ్‌ లింక్‌ల పరంపరలో ఈ వ్యక్తి ఆచూకీ మార్చి చివరినాటికి కానీ బయటపడలేదు. అతడిని పరీక్షిస్తే ఏప్రిల్‌ 3 న పాజిటివ్‌ అని తేలింది. 


అపోలో ఫార్మసిస్టుకు..


కుడకుడ వ్యక్తి మర్కజ్‌ నుంచి వచ్చిన తర్వాత తిరిగిన ప్రాంతాలను ఆరా తీయగా సూర్యాపేటలోని అపోలో ఫార్మసీలో మందులు కొన్నట్లు తేలింది. ఏప్రిల్‌ 5న ఫార్మసిస్టుకు పరీక్షలు చేస్తే అతనికీ పాజిటివ్‌ అని తేలింది. 


బంధువులకు..


తొలి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన బంధువులున్న నాగారం మండలం వర్ధమానుకోటకు వెళ్లివచ్చాడు. వారికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా ఆరుగురికి పాజిటివ్‌ అని ఏప్రిల్‌ 6న బయటపడింది.  


వ్యాపారికి..


అదే సమయంలో సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్‌కు చెందిన ఓ వ్యాపారి కరోనా అనుమానంతో వైద్యుడి వద్దకు వెళ్లగా పాజిటివ్‌ వచ్చింది. మరికొందరికీ సదరు ఫార్మసిస్టుతో సంబంధాలు ఉండటంతో మార్కెట్లోకి కరోనా అడుగుపెట్టింది. 


విశృంఖలం.. వీరవిహారం


మార్కెట్‌లోని వ్యాపారికి కరోనా రావడంతో అతనికి సమీపంగా సంచరించిన వందలమంది నుంచి రక్తనమూనాలు సేకరించారు. వ్యాపారి కుటుంబంతోపాటు మరో రెండుకుటుంబాల్లోని 9 మందికి  పాజిటివ్‌ వచ్చింది. అదేరోజు నేరేడుచర్ల నుంచి మర్కజ్‌కు వెళ్లివచ్చిన వ్యక్తికి, తిరుమలగిరికి చెందిన మరోవ్యక్తికి కరోనా ఖరారైం ది. ఈ తిరుమలగిరికి చెందిన వ్యక్తి కూడా తొలి పాజిటివ్‌ వ్యక్తి నుంచి ప్రైమరీ కాంటాక్ట్‌గా గుర్తించారు. ఏప్రిల్‌ 10 వరకు జిల్లాలో 20 కేసులు నమోదు కాగా ఇందులో 19 కే సులు తొలి బాధితుడి నుంచి వ్యాపించినవే. 


ప్రజల్లో భయాందోళనలు


కూరగాయల మార్కెట్‌లో ఒక్కసారిగా 10 మందికి పాజిటివ్‌ నమోదుకావడంతో పరిసరప్రాంతాల ప్రజలు భయాందోళనలతో పెద్దఎత్తున ప్రభుత్వ క్వారంటైన్‌కు చేరారు. అధికారులు కూడా పెద్దఎత్తున శాంపిల్స్‌ సేకరించారు. ఏప్రిల్‌ 14న సూర్యాపేటలో 2, తిరుమలగిరిలో మరోకేసు నమోదైంది. 16న సూర్యాపేటలో 14, ఆత్మకూర్‌(ఎస్‌) మం డలం ఏపూరులో 1, తిరుమలగిరిలో మరో కేసు నమోదైంది. పట్టణంలో నమోదైన 14 కేసులు కూడా మార్కెట్‌ నుంచి వ్యాపించినవే. ఏపూరు వ్యక్తి కూడా వ్యాపార నిమిత్తం సూర్యాపేట మార్కెట్‌కు వచ్చి వెళ్లినవాడే. 17న వచ్చిన 15 కేసుల్లో 12కేసులు సూర్యాపేటలో కాగా, చివ్వెంల మండలం బీబీగూడెంలో 2, పెన్‌పహాడ్‌ మండలం అనంతారంలో ఒకటి నమోదైంది. ఈ 15 కేసులు కూడా మార్కెట్‌ నుంచి వ్యాప్తి చెందినవే.  తాజాగా మంగళవారం నమోదైన 26 కరో నా కేసుల్లో సూర్యాపేటలో 8, ఆత్మకూర్‌.ఎస్‌ మండలం ఏపూరులో 14, తిరుమలగిరిలో 3తో పాటు మద్దిరాల మండలం పోలుమల్లలో మరో కేసు నేమోదైంది. వీటిలో తిరుమలగిరి మినహా మిగిలినవన్నీ మార్కెట్‌ నుంచి వ్యాప్తి చెందినవే. 


ఇప్పటివరకు నమోదైన 80 కేసుల్లో 79 కేసులు ఒక్కరి నుంచే వ్యాపించినవి. అయితే ఏ ఒక్కరిలో కూడా కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వైర స్‌సోకిన ఆనవాళ్లు లేకుండానే ఇతరులకు అంటించినట్లుగా తెలుస్తున్నది.మంగళవారం 26 కేసులు నమోదైన నేపథ్యంలో వాళ్ల ప్రైమరీ కాంటాక్ట్‌లను కూడా గుర్తించి వంద లమంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. అనుమానం ఉన్న అందరినీ ప్రభుత్వ క్వారంటైన్‌తోపాటు హోంక్వారంటైన్‌లో ఉంచారు. సూర్యాపేటతోపాటు పాజిటివ్‌ కేసులు నమోదైన తిరుమలగిరి, వర్ధమానుకోట, ఏపూరు, అనంతారం, బీబీగూడెం, నేరేడుచర్ల, పోలుమళ్లలో లాక్‌డౌన్‌ పూర్తిగా అమలవుతున్నది. నిత్యావసరాలు ఇంటికే సరఫరాచేస్తున్నారు.


తొలి ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జి


జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 80కి చేరుకున్నాయి. ఆదివారం నాటికి జిల్లా వ్యాప్తంగా 54 కేసులుండగా సోమ, మంగళవారాల్లో కలిపి 26 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇవన్నీ కూడా సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్‌ నుంచే వ్యాప్తి చెందాయని అధికారులు భావిస్తున్నారు. తొలుత పాజిటివ్‌ సోకిన అపోలో ఫార్మసిస్టుకు కరోనా నయం కావడంతో అతడిని హైదరాబాద్‌ గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జిచేశారని కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 688 మంది నుంచి రక్త నమూనాలు తీసి పంపింగా 608 నెగెటివ్‌ రాగా 80 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. మంగళవారం మరో 191 శాంపిళ్లను పరీక్షకోసం పంపించారు. 


మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష


జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలకు విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా మొత్తం జల్లెడ పట్టి కేసులు లేకుండా చేయాలని పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య జిల్లాలో పెరిగిందన్న సమాచారంతో మంత్రి మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌ భాస్కరన్‌తో సమీక్షించారు. కరోనా కట్టడి చర్యలపై చర్చించారు.