ఒక్కడి నుంచి 64 మందికి..

  • ఏపీలోని విజయవాడలో ప్రాణం మీదికి తెచ్చిన పేకాట

  • లారీ డ్రైవర్‌ను కలిసిన మరో 300మంది క్వారంటైన్‌కు

  • లారీ డ్రైవర్‌, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి


    నిర్లక్ష్యంగా ఉంటే కరోనా వ్యాప్తిని ఆపడం తరంకాదని చెప్పడానికి ఇదో ఉదాహరణ. కాలక్షేపం కోసం పేకాట ఆడితే కొవిడ్‌-19అంటుకున్నది. ఏపీలో ఒక్క లారీ డ్రైవర్‌ ద్వారా 64 మందికి వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇంకా వందల మంది బాధితులయ్యే అవకాశమున్నది. కృష్ణా జిల్లాలో ఆదివారం ఒక్కరోజు 52 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఇందులో విజయవాడ కృష్ణలంకలోనివారే 40 మంది ఉన్నారు. వీరందరికీ లారీ డ్రైవర్‌ ద్వారా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం ఈ లారీ డ్రైవర్‌ ద్వారా 24 మందికి వైరస్‌ సోకినట్లు తేల్చిన విషయం తెలిసిందే. ఇటీవల విదేశాల నుంచి ఓ వ్యక్తి ద్వారా మరో 38 మందికి వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కృష్ణలంకలోని లారీ డ్రైవర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న మరో 300 మందిని క్వారంటైన్‌కు తరలించారు. సదరు లారీ డ్రైవర్‌ ఇంకా ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. సదరు లారీ డ్రైవర్‌ కృష్ణలంక వెనుక భాగంలో ఇంటింటికీ వెళ్లి సరదాగా పేకాట ఆడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు లారీ డ్రైవర్‌తోపాటు విదేశాలనుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందినట్లు గుర్తించి ఇద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు విజయవాడ సీపీ ద్వారకాతిరుమల్‌రావు తెలిపారు. ఒక్క లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా కృష్ణలంక 64 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో కలెక్టర్‌ ఇంతియాజ్‌, సీపీ ఆ ప్రాంతంలో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.


    ఏపీలో కొత్తగా 81 పాజిటివ్‌


    ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 81 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేసుల సంఖ్య 1,097కు చేరింది. మొత్తం 31 మంది మృతిచెందారు. ఆదివారం అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి.


    కరోనా గుప్పిట కర్నూలు 


    ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఆరుగురికి వైరస్‌


    హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్నది. కర్నూ లు జిల్లా వైరస్‌ గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్నది. తాజాగా ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే తొమ్మిదిమంది వైద్యులకు కరోనా సోకడం, అందులో ఒకరు మృతి చెందడం కలవరపెడుతున్నది. ఈ నేపథ్యంలో కర్నూలులోని దవాఖానలకు చుట్టుపక్కల జిల్లాలతోపాటు తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు నుంచి ఎవ రూ రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.  కాగా, కర్నూలు జిల్లాలో ఆదివారం నాటికి 279 కేసులు నమోదయ్యాయి. మరోవైపు వైరస్‌ బాధితులను గుర్తించకుండా వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలపై కేసులు నమోదుచేస్తున్నారు. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన ఓ వైద్యుడి వద్దకు రోగులను తీసుకెళ్లిన ఆరుగురు ఆర్‌ఎంపీలను, కృష్ణా జిల్లాలో ఇద్దరిని అధికారులు గుర్తించారు.


     





    పై క్రిమినల్‌ కేసు