అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 50వేలు దాటింది. వైరస్ వల్ల ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో జనం అమెరికాలోనే మరణించారు. ఆ దేశంలో వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 891627, ఇక వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 82268గా ఉన్నది. నోవెల్ కరోనా వల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 50442గా రికార్డు అయ్యింది. అయితే కొన్ని రాష్ట్రాలపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిరసన చేస్తున్న ఆందోళనకారులకు తొలుత అండగా నిలిచినా.. ఆ తర్వాత ట్రంప్ తన మాట మార్చారు. కఠిన ఆంక్షలను ఇంకా అమలు చేయాలని ఆయన ఆయా రాష్ట్రాలకు సూచించారు.
మరో వైపు ఇవాళ అమెరికా సర్కార్.. 484 బిలియన్ల డాలర్ల ఉద్దీపన్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. చిన్న పరిశ్రమలకు, వైరస్ పరీక్షలకు ఆ నిధులను కేటాయిస్తారు. మహమ్మారి ప్రబలుతున్న సమయంలో.. ట్రంప్ ప్రభుత్వం నాలుగోసారి రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో నిరుద్యోగం కూడా హెచ్చు స్థాయికి చేరుకున్నది. సుమారు 27 మిలియన్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది దేశ వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం అని అధికారులు చెబుతున్నారు.