39 మందితో కరోనా పేకాట!

  • కాలక్షేపానికి ఆడితే అంటిన వైరస్‌

  • ఏపీలో ఇద్దరు లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం

    కాలక్షేపానికి పేకాట ఆడితే కరోనా వైరస్‌ అంటుకున్నది. కొవిడ్‌ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో ఇండ్లకే పరిమితమైనప్పటికీ టైంపాస్‌ కోసం ఆడిన పేకాట ప్రాణాల మీదికి తెచ్చింది. ఇద్దరు లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం మూలంగా ఏకంగా 39 మందికి అంటుకున్నదని ఏపీ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ లాక్‌డౌన్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి వచ్చారు. 


    అనంతరం లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఇరుగుపొరుగువారిని పిలిచి పేకాట ఆడారు. దీంతో మహిళలు, పిల్లలు అంతా కలిపి 24 మంది కరోనా బారిన పడ్డారని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ వివరించారు. విజయవాడ కార్మికనగర్‌లో కూడా మరో లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా తన కుటుంబసభ్యులతోపాటు పొరుగువారితో కాలక్షేపానికి పేకాట ఆడారు. దీంతో అక్కడ 15 మందికి వైరస్‌ సోకింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కర్నూలులో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగడం, మరణాలు కూడా సంభవిస్తుండటంతో రాకపోకలను కట్టుదిట్టం చేస్తున్నారు. 


    కర్నూలులోని ధర్మపేటలోని ఓ ప్రైవేట్‌ దవాఖాన వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ దవాఖానలో లాక్‌డౌన్‌ సమయంలోనూ వైద్యం చేయడంతో పలు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ అలంపూర్‌ ప్రాంతానికి చెందినవారు చికిత్స పొందినట్టు కర్నూలు ప్రత్యేకాధికారి ప్రకటించారు. వైద్యురాలికి రోగుల నుంచి వైరస్‌ సోకిందా లేక వైద్యురాలి నుంచి రోగులకు వచ్చిందా అనేది విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ డాక్టర్‌ వద్ద మన రాష్ర్టానికి చెందినవారు వైద్యం చేయించుకోవడంతో వారికి నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వారంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు.