కృష్ణా జిల్లాలో కఠిన ఆంక్షలు.. 3 గంటలే అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలో 48 నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పండ్ల మార్కెట్‌లు, రైతు బజార్లు, ఇతర మార్కెట్‌లకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల(3 గంటలు) వరకే అనుమతిస్తామని కలెక్టర్‌ తేల్చిచెప్పారు. పాలు, పాల ఉత్పత్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు టేక్‌ అవే హోటల్స్‌కు అనుమతి ఉంటుందన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వాహనాలకు, ఆయిల్‌, గ్యాస్‌ ఫిల్లింగ్‌ వాహనాలకు, మొబైల్‌ కమ్యూనికేషన్‌ వాహనాలకు ప్రత్యేక అనుమతితో అనుమతిస్తామన్నారు. పది మందికి మించి ఎక్కడా గుమిగూడొద్దని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు.