వైర‌స్ ఇప్ప‌ట్లో త‌గ్గ‌దు -డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

ఇప్ప‌ట్లో అప్పుడే క‌రోనా వైర‌స్ క‌థ ముగిసిపోదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది.  వైర‌స్‌తో మ‌నం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. చాలా వ‌ర‌కు దేశాలు ఇంకా తొలి ద‌శ‌లోనే ఉన్నాయ‌న్నారు.  వైర‌స్‌ను కంట్రోల్ చేశామ‌ని చెబుతున్న కొన్ని దేశాల్లో మ‌ళ్లీ కొత్త‌గా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆఫ్రికాలో ఇప్పుడిప్పుడే కేసులు అధిక‌మ‌వుతున్నాయ‌న్నారు. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య ల‌క్షా 80 వేలు దాటింది. 


జ‌న‌వ‌రి 30వ తేదీన గ్లోబ‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన‌ట్లు టెడ్రోస్ గుర్తు చేశారు. డ‌బ్ల్యూహెచ్‌వోపై అమెరికా ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. తాను మాత్రం రాజీనామా చేసేది లేద‌ని టెడ్రోస్‌ తెలిపారు. ప‌శ్చిమ యూరోప్‌లో మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు టెడ్రోస్ చెప్పారు. ప్ర‌స్తుత ద‌శ‌లో ఎవ‌రూ ఎటువంటి పొర‌పాట్లు చేయ‌కూడ‌ద‌న్నారు.  మ‌నం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంద‌న్నారు.  ఈ వైర‌స్ మ‌న‌తో చాలా కాల‌మే ఉంటుంద‌న్నారు.  


 ఫండింగ్ విష‌యంలో అమెరికా మ‌ళ్లీ పున‌ర్ ఆలోచించాల‌ని టెడ్రోస్ కోరారు.  జెనీవాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. డ‌బ్ల్యూహెచ్‌వోకు మ‌ళ్లీ అమెరికా నిధులు ఇస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఇది ముఖ్య‌మైన పెట్టుబ‌డిగా అమెరికా భావిస్తుంద‌ని అనుకుంటాన‌న్నారు. అలా చేయ‌డం వ‌ల్ల ఇత‌రుల‌ను ఆదుకోవ‌డ‌మే కాదు, అమెరికా కూడా సుర‌క్షితంగా ఉంటుంద‌న్నారు.  గ‌త ఏడాది డ‌బ్ల్యూహెచ్‌వోకు 400 మిలియ‌న్ల డాల‌ర్లు ఇచ్చింది అమెరికా.