వాషింగ్టన్ : అగ్ర రాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. అమెరికా అంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ వైరస్ బారిన పడ్డ వారు పిట్టల్లా రాలిపోతున్నారు. శవాలు గుట్టగుట్టలుగా పేరుకుపోతున్నాయి. యూఎస్‌లో గడిచిన 24 గంటల్లో 2,700 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు యూఎస్‌లో కరోనా వైరస్‌తో 44,845 మంది చనిపోయారు. కొత్తగా 40 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలకు చేరింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ వీసా నిబంధనలను అడ్డగోలుగా మార్చిన ఆయన.. ఇప్పుడు వలసలపై తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్టు ప్రకటించారు. ‘ఓ అదృశ్య శక్తి దాడి నేపథ్యంలో.. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికాలోకి తాత్కాలికంగా వలసలను నిషేధించే ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయబోతున్నా’ అని ట్రంప్ సోమవారం ట్వీట్ చేశారు. ఈ ఉత్తర్వులు గనుక కార్యరూపం దాల్చితే కొంతకాలం పాటు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ, హెచ్4 వంటి వాటిపైనా నిషేధం విధించవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం భారత్, చైనాకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది.