కరోనా కాలంలో..పెండ్లి తంతు అంతంతే!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాదాసీదాగా..సన్నిహితుల సమక్షంలో వేడుక


పెండ్లంటే పందిళ్లు సందళ్లు తప్పట్లు తాళాలు తలంబ్రాలు.. అంటూ సాగుతుంది ఓ తెలుగు సినిమాపాట. అయితే.. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రస్తుతం వివాహాలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సాదాసీదాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాటిపోతే ముహూర్తాలు మళ్లీ ఏడాదిపాటు లేవన్న కారణంతో సన్నిహితుల మధ్యనే  నిరాడంబరంగా పెండ్లితంతు కానిచ్చేస్తున్నారు.  


పెండ్లి ఖర్చు రూ.2లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌కు..


ఎలాంటి ఆర్భాటం లేకుండా వివాహాన్ని అంగీకరించడమే కాకుండా వేడుకలకు అయ్యే ఖర్చు రూ.2 లక్షలను కరోనా బాధితుల కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు అందించి ఆదర్శంగా నిలిచిందో యువజంట. సంగారెడ్డి జిల్లా కంగ్టి గ్రామ ఏఈవో గాండ్ల సంతోశ్‌ వివాహం శిరీషతో ఆదివారం జరిగింది. పెండ్లికి హాజరైన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు. పెండ్లిఖర్చు మొత్తం సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేయడం పట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి నూతన జంటను అభినందించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సైతం ఏఈవో సంతోష్‌ను ట్విట్టర్‌ లో ‘సిటిజన్‌ హీరో’గా అభివర్ణించిన విషయాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. 


కుటుంబ సభ్యుల మధ్యే వివాహం..


కరీంనగర్‌ జిల్లా చెర్లభూత్కూర్‌కు చెందిన గంగిపెల్లి దేవేంద్ర- కనుకయ్యల కుమార్తె మహేశ్వరి వివాహం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన రాజవ్వ-పోచయ్య దంపతుల కుమారుడు సంతోశ్‌తో జరిగింది. వీరి పెండ్లికి అర్చకుడితోపాటు వధూవరుల తల్లిదండ్రులు, అబ్బాయి ఆడపడుచు మాత్రమే హాజరయ్యారు. మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరి మారుతీనగర్‌కు చెందిన వధువు జయ శ్రీ, చిక్కడపల్లికి చెందిన వరుడు సాయి ప్రకాశ్‌చార్యుల వివాహం మారుతీనగర్‌లో 10మంది మధ్య జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడకు చెందిన కుమ్మరి కృష్ణయ్య-యశోదల కుమారుడు సురేశ్‌, బాచుపల్లికి చెందిన లక్ష్మయ్య-సువర్ణ దంపతుల కూతు రు ప్రవళిక వివాహం కుటుంబసభ్యులు సమక్షంలో జరుపుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో దివంగత బొల్లి సత్యనారాయణ-రాణి దంపతుల కుమార్తె శ్రావణి వివాహం మల్లారం గ్రామానికి చెందిన అజయ్‌తో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య జరిగింది. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన వట్టిమల్ల రాజు-మంగ దంపతుల కూతురు దివ్య పెండ్లి వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన లచ్చయ్య-భారత దంపతుల కొడుకు బాలకృష్ణతో 10మంది మధ్య జరిగింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో బియ్యాల లక్ష్మణ్‌రావు-వినూత్న 12 మంది సమక్షంలోనే మాస్కులు ధరించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి సాదాసీదాగా జరిగినా, లాక్‌డౌన్‌లో కావడం వింత అనుభవాన్ని ఇచ్చిందని వధూవరులు పేర్కొన్నారు.