ఆ కిట్లు వాడొద్దు

  • రెండ్రోజులపాటు ఆగండి

  • యాంటీబాడీ కిట్లపై రాష్ర్టాలకు ఐసీఎంఆర్‌ సూచన 

  • ఫలితాల్లో లోపాలున్నట్టు వస్తున్న..ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం

  • 20 వేలకు చేరువలో కరోనా కేసులు

    ఢిల్లీ: దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టింగ్‌ కిట్లను రెండు రోజుల పాటు వాడొద్దని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌లోని ఎపిడమాలజీ అండ్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ అధిపతి డాక్టర్‌ రామన్‌ ఆర్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ద్వారా చేసిన పరీక్షల్లో కేవలం 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని రాజస్థాన్‌ ప్రభుత్వం మంగళవారం ఆరోపించింది. దీనిపై స్పందించిన రామన్‌.. కిట్ల నాణ్యతపై విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రాష్ర్టాలు ఆయా కిట్లను వాడొదన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,49,810 నమూనాల్ని పరీక్షించామని రామన్‌ చెప్పారు. సోమవారం ఒక్కరోజే 35,852 నమూనాల్ని పరీక్షించామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా  సైన్స్‌ అభివృద్ధి చెందిందని, గత మూడున్నర నెలల కాలంలోనే వైరస్‌ను అడ్డుకునేందుకు పీసీఆర్‌ టెస్టులు, వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియ, హ్యూమన్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నామని ఆయన వెల్లడించారు.    


    20 వేలకు చేరువలో..


    గత 24గంటల్లో 1,336 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం క్రమంగా పెరుగుతున్నదన్నారు. ఇప్పటి వరకు 17.48 శాతం(3252 మంది) కోలుకున్నట్టు చెప్పారు. సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 705 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారన్నారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20 వేలకు చేరువయ్యాయి. వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలో కరోనా కేసులు 19,867కు చేరుకున్నాయి. 646 మంది మృతిచెందారు. 


    ర్యాపిడ్‌ కిట్లలో గందరగోళానికి ఏంటి కారణం.. ? 


    యాంటిజెన్‌-యాంటిబాడీ బేస్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు అంత కచ్చితమైనవి కావు. వైరస్‌ సోకిన వ్యక్తిలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి కావడానికి ఏడు రోజులు పడుతుంది. అయితే వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి నాలుగు రోజుల నుంచే సార్స్‌ కోవి-2లు(వైరస్‌) ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమణ జరుగుతుంది. 


    యాంటీబాడీస్‌ సంఖ్య తగినంత ఉత్పత్తి తర్వాతే క్వారంటైన్‌లో ఉన్నవారిలో ర్యాపిడ్‌ కిట్లతో చేసే పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయి. సార్స్‌కోవి-2 స్థితిలో ర్యాపిడ్‌కిట్లతో యాండీబాడీస్‌ను గుర్తించడం సాధ్యంకాదు. 


    ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగెటివ్‌ వచ్చిన కేసుల్లోనూ ఆర్టీపీసీఆర్‌(రివర్స్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌)తర్వాత పాజిటివ్‌ అని ఫలితం వచ్చింది.