- లాక్‌డౌన్‌పై అలక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ముప్పు
- సామాజిక దూరాన్ని పాటించాలి
న్యూఢిల్లీ : పలు రాష్ర్టాల్లో ప్రజలు లాక్‌డౌన్ పాటించకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, బిహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా కేంద్రం 80 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. కాగా లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోకపోవడంపై ప్రధాని ఈ ఉదయం స్పందించారు. చాలా మంది ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను పాటిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబానికి సురక్షితంగా ఉంచుకోండని చెప్పారు. చట్టాల్ని పాటించేలా చూడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌పై అలక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ముప్పు పెరుగుతుందని గుర్తించాలని మోదీ అన్నారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ అనుభవాలను మరిచిపోవద్దు. మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండి. దేశ క్షేమం కోసం లాక్‌డౌన్ పాటించాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని మోదీ ప్రకటించారు.