మద్యంపై జే-ట్యాక్స్‌



  • నెలకు రూ.300 కోట్లు.. హైదరాబాద్‌లో చెల్లింపు

  • తాడేపల్లి నుంచి ఇండెంట్‌.. కమీషన్లు ఇస్తేనే కొనుగోళ్లు

  • మంచి బ్రాండ్ల సరఫరా బంద్‌.. దుకాణాల్లో పిచ్చి బ్రాండ్లు

  • వైసీపీవారి ‘సొంత తయారీ’.. టీడీపీ సంచలన ఆరోపణ


మద్యం విక్రయాల్లో జగన్‌ ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల కమీషన్లు వసూలు చేస్తోందని టీడీపీ ఆరోపించింది. పేరొందిన పెద్ద కంపెనీలు కమీషన్లు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో,  వాటి నుంచి కొనుగోళ్లు మానివేసి...  కమీషన్లు ఇచ్చే పనికిమాలిన బ్రాండ్లను ప్రభుత్వ మద్యం షాపుల్లో పెట్టి విక్రయిస్తున్నారని తెలిపింది. కమీషన్ల కోసం ధరలు పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారని... దీంతోపాటు, నాణ్యత లేని మద్యం తాగుతున్నందున వారి ఒళ్లు కూడా గుల్ల అవుతోందని తెలిపింది. టీడీపీ ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు మద్యం షాపుల్లో అమ్ముతున్న బ్రాండ్లు ఎప్పుడూ చూడనివే.


 


బూమ్‌ బీర్‌, జార్జెస్‌ విస్కీ వంటి మద్యం బ్రాండ్ల పేర్లు ముఖ్యమంత్రికి ఇష్టమైన దక్షిణాఫ్రికాలో కూడా వినిపించవు. పిచ్చి బ్రాండ్లకు ఈ రాష్ట్రం డంపింగ్‌ యార్డ్‌ మాదిరిగా మారింది. ప్రీమియం మద్యంపై కేసుకు రూ.వెయ్యి, చీప్‌ లిక్కర్‌పై కేసుకు రూ. మూడు వందలు, బీరుపై కేసుకు రూ.వంద చొప్పున కమిషన్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత పది నెలల్లో రాష్ట్రంలో 8 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. హైదరాబాద్‌లో జే-ట్యాక్స్‌ కడితే తాడేపల్లిలో ఇండెంట్‌ ఇస్తున్నారు. ఆ ట్యాక్స్‌ కట్టిన వారి బ్రాండ్లు మాత్రమే తీసుకొంటున్నారు. వాటినే షాపుల్లో విక్రయిస్తున్నారు’’ అని చెప్పారు. మద్యం వ్యాపారం బాగుందని వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల్లో డిస్టిలరీల్లో కొన్ని బ్రాండ్లు తామే తయారు చేయించి ఇక్కడ షాపుల్లో అమ్మిస్తున్నారని తెలిపారు. దీని కోసం డిస్టిలరీలు కూడా తీసుకొంటున్నారు. ‘‘వైఎస్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాల్లో బొత్స వంటి మంత్రులు మద్యం మాఫియాకు నాయకత్వం వహించేవారు. ఇప్పుడు ఈ మాఫియా ఏకంగా జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తోంది’’ అని  ఆరోపించారు.  కమీషన్లు ఇవ్వలేక ఒక ప్రముఖ బ్రాండ్‌ మద్యం తయారు చేసే శ్రీకాకుళం జిల్లా డిస్టిలరీ ఒకటి  సరఫరా మానుకొందని, యూబీ గ్రూప్‌కు చెందిన మరో డిస్టిలరీ కూడా సరఫరా నిలిపివేసిందని తెలిపారు.


 


తాగిన వాళ్లకు అనారోగ్యం


పిచ్చి మద్యం తాగిన వారు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, పొద్దున్నే లేచి పనులకు వెళ్లలేక పోతున్నారని బొండా చెప్పారు. ఆస్పత్రుల చుట్టూ తిరగడం కూడా ఎక్కువైందన్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో... సగటు కార్మికుల సంపాదనలో సగం మద్యానికే ఖర్చవుతోందని తెలిపారు. మరోవైపు.. మద్యం ధరల పెంపు అనేక అక్రమాలకు కూడా దారి తీస్తోందన్నారు. ‘‘పొరుగు రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. సారా తయారీ పెరిగిపోతోంది. కల్తీ మద్యం పుట్టుకొస్తోంది. ప్రభుత్వ షాపులు రాత్రి ఎనిమిదింటికి మూసివేయగానే... వైసీపీ షాపులు తెరుచుకొంటున్నాయి’’ అని తెలిపారు. దశలవారీ మద్య నిషేధం.. ఆచరణలో దశల వారీ ఆదాయ పథకంగా మారిందని విమర్శించారు.