- యెస్ బ్యాంక్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు
- ఈ నెల 11దాకా కస్టడీ
యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో కపూర్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ.. శుక్రవారం నుంచే కపూర్ నివాసం, కార్యాలయాల్లో ముమ్మర సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కపూర్‌ను అరెస్టు చేయగా, ఆదివారం ముంబైలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణకు కపూర్ సహకరించడం లేదని చెప్పడంతో ఈ నెల 11 వరకు కోర్టు ఆయనకు కస్టడీని విధించింది. కపూర్ కుటుంబ సభ్యులు నడిపిస్తున్న కొన్ని సంస్థలు, వాటి వెనుకనున్న వారి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నట్లు ఈ సందర్భంగా కోర్టుకు ఈడీ తెలియజేసింది. మరోవైపు ఈడీ విచారణకు కపూర్ పూర్తిగా సహకరిస్తున్నారని, అయినా అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
20కిపైగా షెల్ కంపెనీలు
రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు కలిసి 20కిపైగా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఈడీ గుర్తించింది. ముడుపులను స్వీకరించడం, ఆపై వచ్చిన సొమ్మును అక్రమాస్తుల్లో పెట్టుబడిగా పెట్టడం వీటి పనని తెలుస్తున్నది. ఇలా రూ.2వేల కోట్ల ఆస్తుల్ని కొనగా, వీటి విలువ ఇప్పుడు రూ.5వేల కోట్లపైనే ఉన్నట్లు సమాచారం. బ్రిటన్‌లోనూ రెండు ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు అంటున్నాయి. బ్యాంక్ నుంచి రుణాలను పొందడానికి కార్పొరేట్ సంస్థలు ఈ షెల్ కంపెనీలకు ముడుపులను తరలించేవంటున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్.. డూఇట్ అర్బన్ వెంచర్స్‌లో రూ.600 కోట్ల పెట్టుబడుల్ని పెట్టినట్లు వినిపిస్తున్నది. ఇది రాణా కపూర్ భార్య, కూతుర్ల ఆధ్వర్యంలో నడుస్తున్నది. యెస్ బ్యాంక్ నుంచి రూ.3,700 కోట్ల రుణాలను తీసుకుని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఎగవేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి షెల్ కంపెనీలు, ఖరీదైన పె యింటింగ్స్, కోట్లాది ఆస్తులపై ఈడీ కన్నే సింది.
రంగంలోకి సీబీఐ
యెస్ బ్యాంక్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సీబీఐ సేకరిస్తున్నట్లు ఆదివారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీబీఐ విచారణ అత్యంత రహస్యంగా జరుగుతున్నదని, దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పాయి. అయితే ప్రాథమిక విచారణ ఆధారంగా కేసు నమోదు చేశారా? లేదంటే ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఫైల్ చేశారా? అన్నది తెలియాల్సి ఉన్నది. మరోవైపు యెస్ బ్యాంక్ ఆధారిత యూపీఐ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. అంతర్జాతీయ
ప్రయాణీకులు, విద్యార్థులు వినియోగిస్తున్న ప్రీ-పెయిడ్ ఫోరెక్స్ కార్డ్స్ సేవలు స్తంభించిపోయాయి. కాగా, ఏటీఎంలలో నగదును అందుబాటులోకి
తెచ్చామని కస్టమర్లు తీసుకోవచ్చని యెస్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
లండన్‌కి ఉడాయిస్తుంటే..?
రాణా కపూర్ కుమార్తె రోషిణి కపూర్.. ఆదివారం లండన్‌కు వెళ్లే విమానం ఎక్కబోతుండగా ముంబై విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. కపూర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, అల్లుడికి లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో రోషిణి కపూర్ విదేశీ
ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి.
ఒత్తిడిలో మార్కెట్లు!
న్యూఢిల్లీ, మార్చి 8: ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్, యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంతో గతవారం భారీ నష్టాల్లో కూరుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారంలోనూ మరింత ఒత్తిడికి గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ఈవారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకు పరిమితంకానున్నది. ఈవారంలోనే విడుదల కానున్న పారిశ్రామిక ప్రగతి గణాంకాలు, రిటైల్, టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
గురువారం ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానుండగా, ఆ మరుసటిరోజే టోకు ధరల సూచీ విడుదలకానున్నది. వరుసగా రెండోవారంలోనూ మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అత్యంత వేగంగా కరోనా వైరస్ విస్తరిస్తుండటం, యెస్ బ్యాంక్ సంక్షోభం మొత్తం బ్యాంకింగ్, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయి ప్రభావం చూపుతున్నట్లు జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తంకావడంతో దేశీయ ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం వారంలోనూ కొనసాగవచ్చునని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు కూడా ఈక్విటీలపై ప్రభావం చూపనున్నాయి. గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 720.67 పాయింట్లు లేదా 1.88 శాతం నష్టపోయింది.