ఎస్‌వీబీసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన సినీ నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడిన మాటలు బయటకు రావడంతో ఆయన్ని పదవి నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ.. తాను మహిళా ఉద్యోగితో మాట్లాడినట్లు వచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఫేక్ అని చెబుతూ ..అందులో తనను మద్యం తాగిన వాడిగా చిత్రీకరించారని ఆరోపించారు. కానీ తాను మద్యం మానేసి ఏడాది కాలమైందని, తానేమీ దేశ ద్రోహం చేయలేదని అన్నారు పృథ్వీ.
‘‘నేను వైసీపీ కార్యకర్తగా ఆరోపణలను ఎదుర్కొన్నప్పుడు పార్టీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని నా పదవికి రాజీనామా చేశాను. నేను ఎప్పుడూ పదవి కోసం ఆరాట పడలేదు. నేను ఆరోపణలు ఎదుర్కొనడానికి రెండు రోజుల ముందు ఓ ఛానెల్ సీఈవో నా అంతు చూస్తానని బెదిరించారు. రైతు ఉద్యమం గురించి నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించారు. పోసాని కృష్ణమురళితో తిట్టించారు. దివ్యవాణిగారు నన్ను కుక్క అన్నారు. నేను గొడ్డులాగా పనిచేశాను. అయితే మా పార్టీలోనే నా తీరు నచ్చనివారున్నారు. నాకు ఈ పదవి రాకూడదని అనుకున్నవారు చాలా మంది ఉన్నారు. నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టినవారు ఎవరూ బతికిలేరు. ఈరోజు నేను రోడ్డు మీద ఉన్నాను. విదేశాల్లో పాస్ పోర్ట్ పోయినవాడిలా ఉన్నాను.
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారితో నేను సైద్ధాంతికంగా మాట్లాడాను. దాని వల్ల నాకు చాలా సినిమాలు పోయాయి. సినిమా రంగంలో ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నారా? అంటే చిరంజీవిగారు. అలాగని మిగతావారిని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. నేను మానసికంగా ఇబ్బందిపడ్డానని, నాకు వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పిన వ్యక్తి చిరంజీవిగారు. ఆయన లేకపోతే నేను సూసైడ్ కూడా చేసుకునేవాడిని. మహిళల పట్ల నేనెప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. నా పార్టీ మీద నాకు ప్రగాఢమైన నమ్మకముంది’’ అని తెలిపారు పృథ్వీ.