నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. మిర్యాలగూడలోని శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ ఉదయం నిర్వహించారు. తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటిక వద్దకు అమృత చేరుకుంది. తండ్రి మృతదేహం వద్దకు రాకుండా అమృతను బంధువులు అడ్డుకున్నారు. దీంతో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే అమృత వెనుదిరిగింది.
మారుతీరావు ఏకైక కుమార్తె అమృతవర్షిణి. అమృత 2018 మేలో మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన ప్రణయ్ కుమార్‌ను ప్రేమించి హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను కిరాయి వ్యక్తులు హత్య చేయగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు సెప్టెంబర్ 15న పోలీసులకు లొంగిపోయాడు. ఏడు నెలలపాటు జైలులోనే ఉన్న అతను బెయిల్‌పై బయటకు వచ్చి న తర్వాత మధ్యవర్తుల ద్వారా తన బిడ్డను ఇంటికి పిలిపించుకునేందుకు యత్నించాడు. అందుకు అమృత అంగీకరించలేదు. గత డిసెంబర్‌లోనూ మరోమారు మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి చేయగా అమృత పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రెండోసారి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో సైతం మారుతీరావు 20రోజులు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇటీవల ఈ కేసు కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. ప్రణయ్ హత్యానంతరం బంధువులతో మనస్పర్థలు.. సుపారీ గ్యాంగ్ ఒత్తిడితో కుంగిపోయిన మారుతీరావు శనివారం రాత్రి హైదరాబాద్‌లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.