మధురై : తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంతే అని ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న మధురైలోని 16 పిల్లర్ మండపం వద్ద డీఎండీకే ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన ప్రేమలత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 1973లో ఎంజీఆర్ ఇక్కడే బహిరంగ సభ నిర్వహించి.. ఎన్నికలకు వెళ్లారు. ఆయన తమిళనాడుకు సీఎం అయ్యారు. అదే సెంటిమెంట్‌తో తాము కూడా ఇక్కడ్నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు. తమిళనాడుకు విజయ్‌కాంతే సీఎం అవుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 2021లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో మహిళలు కీలకపాత్ర పోషించాలని ప్రేమలత పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్నార్సీ పేరిట కొందరు దేశాన్ని విభజిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు మున్సిపల్ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేస్తుందన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్.. కరోనా వైరస్ కంటే ప్రమాదమని ప్రేమలత అన్నారు.
తమిళనాడుకు కాబోయే సీఎం ఆయనే!