మొన్న రోహిత్ రోదిస్తే.. నిన్న యశస్వి జైస్వాల్ వేదనకు గురయ్యాడు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు మన అమ్మాయిలు చరిత్ర తిరుగరాస్తారనుకుంటే.. అదీ సాధ్యపడలేదు. కలల కప్పును ముద్దాడాలనుకున్న హర్మన్ బృందం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అదిరిపోయే విజయాలతో ఫైనల్ చేరిన టీమ్‌ఇండియా.. మొదట బౌలింగ్‌లో ఆకట్టుకోలేక.. ఆనక బ్యాటింగ్‌లోనూ మ్యాజిక్ చేయలేక.. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోలేక.. భారమైన గుండెలతో.. తడబడుతున్న అడుగులతో.. రన్నరప్‌తో సంతృప్తిపడింది.
- టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి..
- 85 పరుగులతో ఆస్ట్రేలియా విజయం..
- ఐదోసారి కప్ కైవసం
- ప్రైజ్ మనీ
- ఆస్ట్రేలియా 7.40 కోట్లు
- భారత్ 3.70 కోట్లు
మెల్‌బోర్న్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. తుదిపోరులో తడబడింది. ఆదివారం ఎంసీజీలో జరిగిన ఆఖరాటలో 85 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమ్‌ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంటే.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఐదోసారి సగర్వంగా కప్పును ముద్దాడింది. ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధశతకాలతో రెచ్చిపోవడంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. పూనమ్ యాదవ్ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్యఛేనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్‌స్కారర్. ఆసీస్ బౌలర్లలో షుట్ (4/18), జెస్ జొనాసెన్ (3/20) విజృంభించారు. హేలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'అవార్డులు దక్కాయి.
ఆ రెండు క్యాచ్‌లు పట్టుంటే..
ఓపెనర్లిద్దరూ దంచి కొట్టడంతో ఆసీస్‌కు శుభారంభం దక్కింది. దీప్తి వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి హేలీ క్యాచ్‌ను షఫాలీ వదిలేస్తే.. నాలుగో ఓవర్‌లో మూనీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను రాజేశ్వరి నేలపాలు చేసింది. మొదట్లో మూనీ కాస్త సంయమనం పాటించినా.. హేలీ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. భార్య మ్యాచ్ చూసేందుకు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగొచ్చిన స్టార్క్ స్టాండ్స్‌లో కూర్చొని ప్రోత్సహిస్తుంటే.. హేలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 115 పరుగులు జోడించాక రాధ ఈ జోడీని విడదీసింది. ఆ తర్వాత లానింగ్ (16), గార్డ్నర్ (2), హైన్స్ (4), నికోలా (5) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. క్రీజులో పాతుకుపోయిన మూనీ వరుస బౌండ్రీలతో జట్టుకు భారీ స్కోరు అందించింది.

ఒకరి వెంట ఒకరు..
బ్యాటింగ్‌కు దిగకముందే సగం మ్యాచ్ ఓడిన భారత అమ్మాయిలకు తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీ ఆసాంతం రెచ్చిపోయి ఆడిన యువ ఓపెనర్ షఫాలీ వర్మ (2) అసలు పోరులో విఫలమైంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తానియా (2) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే.. జెమీమా (0) సున్నాచుట్టింది. ఆదుకుంటారనుకున్న సీనియర్లు స్మృతి మంధాన (11), హర్మన్‌ప్రీత్ కౌర్ (4) కూడా చేతులెత్తేయడంతో.. భారత జట్టు 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీప్తి, వేద (19), రిచా (18) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది.
అచ్చం అలాగే..
ఫైనల్ మ్యాచ్ చూసిన అభిమానులకు పదిహేడేండ్ల క్రితం పురుషుల వన్డే ప్రపంచకప్ తుదిపోరు గుర్తుకు రాకమానదు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం (మార్చి 23, 2003).. పురుషుల క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. అప్పుడు కూడా ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన రికీ పాంటింగ్ సేన.. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ఫైనల్ చేరితే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అద్వితీయ ప్రదర్శనతో టీమ్‌ఇండియా తుదిపోరుకు అర్హత సాధించింది. జొహాన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గంగూలీ.. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. తాజా మ్యాచ్‌లో టాస్ నెగ్గిన కంగారూలు కూడా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు దంచికొట్టడంతో కంగారూలకు శుభారంభం దక్కగా.. ఆదివారం మ్యాచ్‌లోనూ ఓపెనర్లే విధ్వంసం సృష్టించారు. ఆ రోజు తొలి ఓవర్ వేసిన జహీర్ ఖాన్ 15 పరుగులు సమర్పించుకుంటే.. ఇప్పుడు దీప్తి శర్మ 14 రన్స్ ఇచ్చింది. టోర్నీ ఆసాంతం రాణించిన సచిన్ అప్పుడు తొలి ఓవర్‌లోనే ఔటైతే.. ఇప్పుడు షఫాలీ వర్మ మాస్టర్‌ను అనుసరించింది.
మెల్‌బోర్న్ @ 86,174

మహిళల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఎంసీజీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను 86,174 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఐసీసీ మహిళల క్రికెట్‌లో ఇంత మంది అభిమానులు మైదానానికి తరలిరావడం ఇదే తొలిసారి.
జూలై 9, 2019
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీస్..

లీగ్ దశలో విజృంభించిన టీమ్‌ఇండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. లక్ష్యం పెద్దది కాకపోయినా.. ఒత్తిడికి చిత్తైన కోహ్లీ సేన లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయి భారంగా ఇంటి బాటపట్టింది.
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్..

గ్రూప్‌లో అజేయంగా నిలచిన యువ భారత్.. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను, సెమీస్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి తుదిపోరుకు చేరింది. ఒక్క విజయం సాధిస్తే ట్రోఫీ సొంతమవుతుందనుకున్న తరుణంలో బంగ్లాదేశ్ చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది.
మార్చి 8, 2020
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్..

ఓటమి ఎరుగకుండా గ్రూప్ దశను ముగించిన భారత జట్టు.. వర్షం కారణంగా సెమీఫైనల్ రద్దుకావడంతో నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంకేముంది మరొక్క మ్యాచ్ నెగ్గితే విశ్వకిరీటం మనదే అనుకుంటే మరోమారు కూడా భారతీయులకు నిరాశే ఎదురైంది.
మా జట్టుపై నాకు నమ్మకముంది. లీగ్ దశలో గొప్పగా ఆడాం. ఆటలో గెలుపోటములు సహజం. తిరిగి పుంజుకుంటాం. దురదృష్టవశాత్తు ఈరోజు మేం క్యాచ్‌లు జారవిడిచాం. భవిష్యత్తులో గొప్పగా రాణిస్తామనే నమ్మకముంది. షఫాలీకి ఇదే తొలి ప్రపంచకప్. జట్టు కోసం ఆమె ఎంతో పోరాడింది.
-హర్మన్, భారత కెప్టెన్
1. పరుగుల పరంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇదే భారీ గెలుపు.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఓ జట్టు ఓపెనర్లు 75 పరుగులకు పైగా చేయడం ఇదే తొలిసారి.
ఐసీసీ టోర్నీ ఫైనల్లో వేగవంతమైన అర్ధశతకం బాదిన ప్లేయర్‌గా హార్దిక్ పాండ్య (32 బంతులో) రికార్డును హేలీ (30 బంతుల్లో) తిరగరాసింది.
అత్యధిక పరుగులు - మూనీ (ఆస్ట్రేలియా, 259)
అత్యధిక వికెట్లు - మేగన్ షుట్ (ఆస్ట్రేలియా, 13)
5. ఆస్ట్రేలియా ప్రపంచకప్ నెగ్గడం ఇది ఐదోసారి. ఆరుసార్లు ఫైనల్ చేరిన ఆ జట్టు కేవలం ఒకే సారి తుదిపోరులో పరాజయం
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా: హేలీ (సి) వేద (బి) రాధ 75, మూనీ (నాటౌట్) 78, లానింగ్ (సి) శిఖ (బి) దీప్తి 16, గార్డ్నర్ (స్టంప్డ్) తానియా (బి) దీప్తి 2, హైన్స్ (బి) పూనమ్ 4, నికోలా (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 184/4. వికెట్ల పతనం: 1-115, 2-154, 3-156, 4-176, బౌలింగ్: దీప్తి 4-0-38-2, శిఖ 4-0-52-0, రాజేశ్వరి 4-0-29-0, పూనమ్ 4-0-30-1, రాధ 4-0-34-1.
భారత్: షఫాలి (సి) హేలీ (బి) షుట్ 2, మంధాన (సి) నికోలా (బి) మొలినెక్స్ 11, తానియా (రిటైర్డ్‌హర్ట్) 2, జెమీమా (సి) నికోలా (బి) జెస్ జొనాసెన్ 0, హర్మన్ (సి) గార్డ్నర్ (బి) జెస్ జాన్సన్ 4, దీప్తి (సి) మూనీ (బి) నికోలా 33, వేద (సి) జెస్ జొనాసెన్ (బి) డెలిస్సా 19, రిచా (సి) నికోలా (బి) షుట్ 18, శిఖ (సి) మూనీ (బి) షుట్ 2, రాధ (సి) మూనీ (బి) జెస్ జొనాసెన్ 1, పూనమ్ (సి) గార్డ్నర్ (బి) షుట్ 1, రాజేశ్వరి (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 19.1 ఓవర్లలో 99 ఆలౌట్. వికెట్ల పతనం: 1-2, 1-5*, 2-8, 3-18, 4-30, 5-58, 6-88, 7-92, 8-96, 9-97, 10-99, బౌలింగ్: షుట్ 3.1-0-18-4, జెస్ జొనాసెన్ 4-0-23-3, మొలినెక్స్ 4-0-21-1, డెలిస్సా 4-0-17-1, నికోలా 4-0-23-1.