విశాఖలో.. వినూత్న కార్యక్రమం

  • మహిళలకు హెల్మెట్లు

  • బైక్‌ వెనుక కూర్చునే వారికి ఉచితంగా పంపిణీ

  • నగర పోలీసుల వినూత్న కార్యక్రమం

  • సీఎస్‌ఆర్‌ నిధులతో కొనుగోలు

  • రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడమే లక్ష్యం

  • త్వరలోనే పంపిణీకి శ్రీకారం

    నగరానికి చెందిన విజయలక్ష్మి సోమవారం భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై మధురవాడలోని తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. కార్‌షెడ్‌ జంక్షన్‌ వద్దకు వెళ్లేసరికి వెనుక నుంచి ప్రైవేటు స్కూల్‌ బస్సు ఢీకొనడంతో ఆమె కిందపడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


     


    ఇదే మాదిరిగా గత నెల 29నపెందుర్తి సమీపంలోని పెట్రోల్‌బంకు వద్ద ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న ఉపాధ్యాయురాలు మృతిచెందారు.


     


    ...ఇలా నగరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి రెండు రోజులకు సగటున ముగ్గురు మృతి చెందుతుండంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అందుబాటులో వున్న మార్గాలను అన్వేషిస్తున్నారు. బైక్‌ వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌)కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని చెప్పినా ఎవరూ పాటించకపోవడంతో  ఉచితంగా పంపిణీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. 


     


    నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారే ఉంటున్నారు. తలకు గాయం కాకుండా కాపాడగలిగితే మృతుల సంఖ్యను తగ్గించవచ్చునని గుర్తించిన పోలీసులు కొంతకాలంగా హెల్మెట్‌ ధారణపై స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపే వారిపై ఎడాపెడా కేసులు నమోదు చేస్తుండడంతో ప్రస్తుతం నగరంలో 90 శాతం మందికిపైగా వాహన చోదకులు హెల్మెట్‌ ధరిస్తున్నారు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బైక్‌ నడిపే వ్యక్తి హెల్మెట్‌ ధరించి వుండడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నా, వెనుక కూర్చునేవాళ్లకు హెల్మెట్‌ లేకపోవడం వల్ల తలకు గాయమై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. దీనిని అధిగమించడం ఎలా అనే దానిపై నగర పోలీసులు దృష్టిసారించారు.


     


    బైక్‌ వెనుక కూర్చొనే వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించినట్టయితే మృతుల సంఖ్యను తగ్గించవచ్చునని గుర్తించారు. అందుకోసం వాహనచోదకులను సమాయత్తం చేసేలా కొంతకాలంపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తర్వాత కేసులు నమోదుచేయాలని యోచించారు. దీనిపై ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పోలీసులు దీనిని మరికొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించారు. అప్పటివరకూ పూర్తిగా వదిలేయకుండా వాహనచోదకులతోపాటు పిలియన్‌ రైడర్స్‌ కూడా హెల్మెట్‌ ధరించే అలవాటును పెంపొందిస్తే ఫలితం వుంటుందని గుర్తించారు. అందుకోసం బైక్‌లపై మహిళా పిలియన్‌ రైడర్‌ వుంటే అలాంటి వాహనాలను నిలిపి వెనుక కూర్చొన్న వారు కూడా హెల్మెట్‌ ధరించాలని సూచించడంతోపాటు ఉచితంగా హెల్మెట్‌ను అందజేయాలని నిర్ణయించారు. 


     


    పది వేల హెల్మెట్‌లు పంపిణీ చేయాలని యోచన


    నగరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా బైక్‌ వెనుక కూర్చొనే మహిళలు మృత్యువాత పడకుండా వుండేందుకు వీలుగా పది వేల హెల్మెట్‌లు పంపిణీ చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. దీనికి అవసరమైన నిధులను నగరంలోని వివిధ పరిశ్రమలు, సంస్థలు, ఆస్పత్రుల నుంచి సమకూర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే ఎలాంటి హెల్మెట్‌లు కొనుగోలు చేయాలనే దానిపై పోలీస్‌ అధికారులు చర్చించడంతోపాటు కొన్ని మోడళ్లను ఎంపిక చేశారు. కంపెనీ ద్వారానే వాటిని కొనుగోలు చేసి నగరంలోని ముఖ్యమైన కూడళ్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలుపుదల చేసి మహిళా పిలియన్‌ రైడర్‌కు హెల్మెట్‌ను అందజేయనున్నారు.


     


    హెల్మెట్లు దుర్వినియోగం కాకుండా ఏ వాహనంపై వున్న మహిళకు అందజేశామనే వివరాలతోపాటు యజమాని ఫోన్‌ నంబర్‌ను తీసుకుని వాటిని ఆన్‌లైన్‌ చేయాలని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. అలా హెల్మెట్‌ తీసుకున్నవారు ఆ తరువాత ఎప్పుడైనా ధరించని పక్షంలో జరిమానా విధిస్తారు. హెల్మెట్ల పంపిణీని వారం రోజుల్లోగా ప్రారంభించనున్నట్టు పోలీస్‌ అధికారులు తెలిపారు. 


     




    Advertisement