మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం కమల్‌నాథ్ ప్రభుత్వం.. రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుంది. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను .. బీజేపీ లాక్కెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. సీఎం కమల్‌నాథ్ స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఉద్దేశంతో.. కాంగ్రస్ పార్టీ ఎమ్మెల్యేలను గురుగావ్ తీసుకువెళ్లినట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు ఆరోపించారు. హర్యానాలోని ఓ హోటల్‌లో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. బీజేపీ దాచిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బీఎస్పీకి చెందిన ఓ ఎమ్మెల్యేను.. బీజేపీ నేతలు హర్యానా తీసుకువెళ్లినట్లు మాజీ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ నేతలకు ముడుపులు ఇస్తున్నారని కూడా దిగ్విజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను.. బీజేపీ కొట్టిపారేసింది. రాజ్యసభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో.. దిగ్విజయ్ ఈ డ్రామా ఆడుతున్నట్లు బీజేపీ ఆరోపించింది.
దిగ్విజయ్‌తో పాటు ఆయన కుమారుడు, మంత్రి జైవర్ధన్ సింగ్.. హర్యానా హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లారు. అయితే ఆ ఎమ్మెల్యేల తమ ఆధీనంలోనే ఉన్నట్లు సీఎం కమల్‌నాథ్ అన్నారు. వారు మళ్లీ వెనక్కి వస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 35 కోట్ల వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల దిగ్విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. హార్స్ ట్రేడింగ్ వల్ల ఉచితంగా డబ్బు వస్తే.. ఆ డబ్బును మీరే తీసుకోండి అంటూ సీఎం కమల్‌నాథ్ అన్నారు. నిన్న రాత్రి మాజీ సీఎం శివరాజ్ సింగ్.. హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.