అగ్రరాజ్యం అమెరికాను సైతం కరోనా మహమ్మారి ముప్పుతిప్పలు పెడుతున్నది. అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు వివిధ రాష్ట్రాల సెనేటర్లు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కరోనా వైరస్ విస్తరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో అమెరికావ్యాప్తంగా 100కు పైగా కరోనా మరణాలు సంభవించాయి. జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ 100 మరణాలతో కలిపి అమెరికాలో కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 419కి చేరింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 33,546 కు పెరిగింది. ఇదిలావుంటే దేశంలో కరోనా విజృంభిస్తున్నా దవాఖానల్లో వైద్యపరికరాలు మాత్రం అందుకు సరిపడా లేవంటూ వివిధ రాష్ట్రాల్లో వైద్యుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికాలోని భారత సంతతి వైద్యులు మాత్రం అధ్యక్షుడు ట్రంప్ చర్యలను స్వాగతిస్తున్నారు.