బాహుబలి చిత్రంతో దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన ప్రభాస్ ఇటీవల సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ప్రేక్షకులని బాగానే అలరించినప్పటికీ, తెలుగు ఆడియన్స్ మనసులు గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ప్రభాస్ 20వ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈమూవీ సెట్స్ పైకి వెళ్ళి చాలా రోజులే అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో చిత్ర బృందం ఉగాది కానుకగా ప్రభాస్ 20వ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
తాజా షెడ్యూల్ కోసం జార్జియాకి వెళ్ళే ముందు ప్రభాస్ 20వ మూవీ చిత్ర బృందం యూరప్ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేకమైన ఇల్లు, ట్రైన్ సెట్ వేసి ప్రభాస్, పూజా హెగ్డేలపై నాలుగు వేర్వేరు దుస్తులలో ఫోటో షూట్ చేశారట. ఈ నాలుగు స్టిల్స్ నుండి, మేకర్స్ ఫస్ట్ లుక్ కోసం రెండు పోస్టర్లను ఖరారు చేశారు. ఒక పోస్టర్లో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే రైలు కంపార్ట్మెంట్లో కూర్చుని కనిపిస్తారు. రెండవ పోస్టర్‌లో ఇద్దరు కలిసి పియానోను ప్లే చేస్తూ ఉల్లాసమైన మూడ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తారు. ఉగాది సందర్భంగా రెండు పోస్టర్స్‌ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఏడాది చివరలో చిత్రం రిలీజ్ కానుంది.