ఆఖరివరకూ పోరాడిన కివీస్.. ఉత్కంఠపోరులో భారత్‌దే విజయం


మెల్‌బోర్న్: మహిళల టీ-20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మహిళ జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. జంక్షన్ ఓవెల్ వేదికగా భారత్‌తో జరిగిన ఉత్కంఠపోరులో కివీస్ జట్టు స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. ఆల్ రౌండర్ అమిలియా కెర్ర్ జట్టుకు విజయాన్ని అందించేందుకు ఆఖరి బంతి వరకూ పోరాడిన ఫలితం భారత్‌కు అనుకూలంగానే వచ్చింది. 



ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 133 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్‌ పవర్‌ప్లే ముగిసే సమయానికే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. స్కోర్ సాధించేందుకు కివీస్ అమ్మాయిలు ఎంత కష్టపడినా.. భారత బౌలర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అయితే 90 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుకు అమిలియా కెర్ర్ అండగా నిలిచింది. జట్టుకు విజయాన్ని అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించింది. 19 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసింది. పూనమ్ యాదవ్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు పరుగులతో 18 పరుగులు చేసి జట్టును దాదాపు విజయానికి చేరువ చేసింది. కానీ, చివరి ఓవర్‌లో మాత్రం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. కెర్ర్ తీవ్రంగా పోరాడినప్పటికీ న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌కి అర్హత సాధించింది.