ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, యూరోప్ దేశాల తరహాలో ఆసియా మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. ఆస్ట్రేలియా షేర్ మార్కెట్ ఇవాళ 3.3 శాతం పడిపోయింది. ఆ దేశానికి చెందిన ఏఎస్ఎక్స్200 మార్కెట్ కూడా పది శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. 2008 తర్వాత ఆస్ట్రేలియాలో మార్కెట్లు పడిపోవడం ఇదే మొదటిసారి. జపాన్‌కు చెందిన నిక్కీ ఇండెక్స్ కూడా డౌన్ అయ్యింది. నిక్కీ షేర్లు మూడు శాతం పడిపోయాయి. అమెరికాలో గురువారం డౌ జోన్స్ అత్యధిక స్థాయిలో పతనమైంది. అయితే అమెరికా మార్కెట్ ప్రభావం వల్ల జపాన్ మార్కెట్లు కూడా నిర్వీర్యం అవుతున్నాయి.
మరోవైపు కరోనా కేసులు కొత్తగా పలు దేశాల్లో నమోదు అయ్యాయి. సబ్ సహారా ఆఫ్రికా దేశమైన లాగోస్, నైజీరియాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. న్యూజిలాండ్‌లో కూడా తొలి కేసు నమోదు అయ్యింది. ఇరాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేల్చారు. యూరోప్‌లోని బెలారస్, నెదర్లాండ్స్, లిథువేనియా కూడా తొలి కేసు నమోదు అయినట్లు పేర్కొన్నాయి. దక్షిణకొరియాలో కరోనా కేసులు 256కు చేరుకున్నాయి. నార్త్ కొరియాకు వైద్య పరికరాలు పంపేందుకు డబ్ల్యూహెచ్‌వో కొన్ని ఆంక్షలను ఎత్తివేసింది. జపాన్‌లో రెండు డిస్నీ థీమ్ పార్క్‌లను రెండు వారాల పాటు మూసివేశారు.