అన్నపూర్ణ దిశగా..

  • కాళేశ్వరం రెండోఘట్టానికి రంగంసిద్ధం

  • త్వరలో అన్నపూర్ణ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు

  • ఎస్సారార్‌ నుంచి కొండపోచమ్మ వరకు తరలింపుపై ప్రభుత్వం దృష్టి

  • ‘అన్నపూర్ణ’ ముంపు కాలనీతరలింపు చర్యలు ప్రారంభం

    తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పరుగులు పెడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల్లో రెండోఘట్టానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే గోదావరి నుంచి భారీ మోటర్ల ద్వారా పలు రిజర్వాయర్లను దాటుకుంటూ నల్లగొండ, ఖమ్మం దాకా బీడుభూముల్ని మాగాణంలా మారుస్తున్న కాళేశ్వరం జలాలు కొద్ది రోజుల్లోనే కొండపోచమ్మ వైపు పరుగుపెట్టనున్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ (అనంతగిరి), రంగనాయకసాగర్‌.. ఆపై మల్లన్నసాగర్‌ మీదుగా కొండపోచమ్మ జలాశయానికి గోదావరిజలాల తరలింపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశంతో రెవెన్యూ, పోలీసు, నీటిపారుదలశాఖ అధికారులు రెండ్రోజులుగా మార్గం సుగమంచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వారంలోనే ఎస్సారా ర్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు కాళేశ్వరజలాలను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 


     


    త్వరలో అన్నపూర్ణకు కాళేశ్వరజలాలు


    ఎస్సారార్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు గోదావరిజలాలను ఎత్తిపోసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలిసింది. 64.5 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు మోటర్లు ఇప్పటికే సిద్ధంగా కాగా.. 12.03 కిలోమీటర్ల మేర సొరంగమార్గం కూడా గతంలోనే పూర్తయింది. అన్నపూర్ణ రిజర్వాయర్‌ ముంపునకు సంబంధించి మిగిలిపోయిన ఒక గ్రామం తరలింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ రెండ్రోజుల క్రితం ఆదేశించడం తో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌, ఎస్పీతోపాటు నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రెండ్రోజుల్లో తరలింపు పూర్తయ్యే అవకాశమున్నది. ఆ వెంటనే ఎస్సారార్‌ నుంచి తొలిసారిగా గోదావరిజలాలు అన్నపూర్ణ రిజర్వాయర్‌కు పరుగులు తీయనున్నాయి. 


     


    ఈ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు. ఇక్కడి నుంచి రంగనాయకసాగర్‌కు తరలించనున్నా రు. ఇందుకు ప్యాకేజీ-10,11,12ల్లోని పంపుహౌజ్‌ల్లో మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. ప్యాకే జీ-10, 11ల్లో 135 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లు, ప్యాకేజీ-12లో43 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది మోటర్లు రోజుకు టీఎంసీ చొప్పున ఎత్తిపోసేందుకు సిద్ధంచేశారు. అనంతరం రంగనాయకసాగర్‌ నుంచి మల్లన్నసాగర్‌ వద్ద ఏర్పాటుచేసిన ఫీడర్‌ ఛానెల్‌ ద్వారా కొండపోచమ్మ సాగర్‌లో కి తరలించనున్నారు. ఈ జలాశయపరిధిలో ముం పు గ్రామాల ఖాళీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే 15 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఉన్న కొండపోచమ్మ సాగర్‌లోకి కాళేశ్వర జలాలు ప్రవేశించనున్నాయి. వర్షాకాలంనాటికి కొండపోచమ్మసాగర్‌ వరకు కాళేశ్వర జలాల తరలింపునకు మార్గంసుగమంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.



    లక్ష్మీబరాజ్‌ సగం ఖాళీ


    కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కాళేశ్వరం/ మహదేవ్‌పూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-1,2లో గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. సాంకేతిక ప్రొటోకాల్‌లో భాగంగా 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల లక్ష్మీబరాజ్‌ సోమవారం ఎనిమిది టీఎంసీల దిగువకు చేరింది. లక్ష్మీ పంపుహౌజ్‌లోని 5 మోటర్లను ఆన్‌చేసి 10,500 క్యూసెక్కుల ను సరస్వతి బరాజ్‌లో పోస్తున్నారు. సరస్వతి పంపుహౌజ్‌లోని 1, 2,3, 4,7,8 మోటర్లను ఆన్‌చేసి 17,400 క్యూసెక్కులను పార్వతి బరాజ్‌లోకి పంపుతున్నారు. పార్వతి పంప్‌హౌజ్‌లో తొమ్మిది పంపులను ఆన్‌చేయగా 23,490 క్యూసెక్కుల నీరు  ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తున్నది. లింక్‌-2లో నంది పంప్‌హౌజ్‌ నుంచి 6,300 క్యూసెక్కులు నంది రిజర్వాయర్‌లోకి, 7వ ప్యాకేజీలోని జంటసొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని గాయత్రి పంప్‌హౌజ్‌కు తరలుతున్నాయి. ఎస్సారార్‌ జలాశయం రివర్స్‌స్లూయిస్‌ ద్వారా ఎల్‌ఎండీకి 4,572 క్యూసెక్కుల నీటిని పంపించారు. 


     


    ఊరు ఖాళీచేసేందుకు నిర్వాసితుల అంగీకారం ఫలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే చర్చలు


    ఇల్లంతకుంట: కాళేశ్వరం 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి శివారులో నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్‌ (అనంతగిరి)లోకి నీటివిడుదలకు లైన్‌క్లియర్‌ అయింది. సోమవారం అనంతగిరి గ్రామస్తులతో కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ జరిపిన చర్చలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తిచేసినప్పటికీ ఈ ఒక్క గ్రామస్తులు సహకరించకపోవడం తో ఎస్సారార్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయలేకపోయా రు. చర్చలు ఫలించడంతో అందరూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడు తూ.. ముంపు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండుమూడురోజుల్లో పరిష్కరించడానికి కృషిచేస్తానని చెప్పారు. ముంపు బాధితులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం ఇస్తామని హామీఇచ్చారు.


     


    ఇండ్లు ఖాళీచేస్తాం 


    ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఇచ్చిన హామీ మేరకు నివాసాలను రెండురోజుల్లో ఖాళీచేస్తాం. ఇండ్లు నిర్మించుకొనేవరకు అద్దె ఇండ్లల్లో ఉంటాం. మాకు ప్రభుత్వం ద్వారా అద్దె ఇప్పించాలి. చిన్నచిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని ప్రభు త్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించి మాకు అండగా ఉండాలి. సర్వంకోల్పో యి ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. మాకు ప్రభుత్వం అండగా ఉండాలి. 


    న్యాత అశోక్‌, ముంపు బాధితుడు