ముంబై: రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ నుంచి అంపైర్ నిర్ణయ సమీక్ష(డీఆర్‌ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దేశవాళీ టోర్నీ రంజీల్లో అంపైర్ నిర్ణయాలను సమీక్షించనుండటం ఇదే తొలిసారి. గత సీజన్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ తప్పిదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో డీఆర్‌ఎస్‌ను విధానాన్ని అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రెడ్‌జోన్, స్పిన్ విజన్‌తో పరిమిత స్థాయిలో డీఆర్‌ఎస్‌ను మాత్రమే వినియోగించనున్నారు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై ఆటగాళ్లు సమీక్ష కోరితే మూడో అంపైర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
2019-20 సీజన్‌లో భాగంగా శనివారం నుంచి జరిగే సెమీస్‌లో గుజరాత్‌తో సౌరాష్ట్ర.. పశ్చిమ బెంగాల్‌తో కర్ణాటక జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సెమీస్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ పోరులో ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఒక్కో ఇన్నింగ్స్‌లో టీమ్‌కు రెండు చొప్పున నాలుగు ప్లేయర్ రివ్యూ అవకాశాలు ఉంటాయి.