భారత రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానితో చర్చల్లో మత స్వేచ్ఛ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్ సమస్యను ముల్లుతో పోలుస్తూ మధ్య వర్తిత్వానికి తాను సిద్ధమని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఉగ్రవాద నిర్మూలనకు పాక్ కృషి చేస్తోందని కితాబులిచ్చారు. భారీ సుంకాలు విధించడం తగదంటూ భారత్‌కు సుద్దులు చెప్పారు.
ఘనమైన స్వాగతం అందుకుని... ‘ధనమైన’ రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోతూ పోతూ భారత్‌ను, తన ఆత్మీయ మిత్రుడైన మోదీని ‘ఇరకాటం’లో పెట్టే అనేక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల భారత పర్యటనలో చివరి రోజైన మంగళవారం ఆయన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని చారిత్రక ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తాను బస చేసిన హోటల్‌లోనూ ట్రంప్ పాత్రికేయులతో ముచ్చటించారు. అన్ని సందర్భాల్లో తనదైన శైలిలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఆత్మీయ, ప్రత్యేక మిత్రుడు మోదీకి ‘మత స్వేచ్ఛ’ గురించి ప్రత్యేక సూచనలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రస్తావించలేదంటూనే... దాని సారాంశమైన మత స్వేచ్ఛ, సమానత్వంపై మోదీతో వివరంగా చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. భారత్‌లో ముస్లింలపై వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై మోదీతో చర్చించారా? అని ప్రశ్నించగా... ‘‘ఔను. మత స్వేచ్ఛపై మోదీతో మాట్లాడాను. ముస్లింలతో మిళితమై పని చేయాలని ఆయన భావిస్తున్నారు. మనం గతాన్ని పరిశీలిస్తే మత స్వేచ్ఛను కాపాడేందుకు భారత్ ఎంతగానో కృషి చేసిందని స్పష్టమవుతుంది’’ అని చెప్పారు.
ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన సీఏఏ గురించి మోదీతో మాట్లాడారా అనే ప్రశ్నకు... ‘లేదు’ అని సూటిగా జవాబిచ్చారు. ‘‘సీఏఏ గురించి నేను చెప్పేందుకేమీ లేదు. అది భారత్‌కు సంబంధించిన విషయం. తన ప్రజల కోసం సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన హింస గురించి కూడా మోదీతో మాట్లాడలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఇది భారత్‌కు సంబంధించిన అంశం’ అన్నారు.
కశ్మీర్.. పెద్ద అంశం!
కశ్మీర్‌పై ‘మధ్యవర్తిత్వం’ నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘‘కశ్మీర్ చాలా పెద్ద అంశం. ఇరువైపులా అనేక మందిని ముల్లులా గుచ్చుకుంటోంది. ఈ విషయంలో కుదిరితే, చేయగలిగితే మధ్యవర్తిత్వం చేస్తాను’’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై మధ్యవర్తిత్వం చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ గురించి, ఉగ్రవాదం గురించీ మోదీ, తానూ చాలా మాట్లాడుకున్నామన్నారు. అదే సమయంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో తనకు మంచి సంబంధాలు (ఈక్వేషన్) ఉన్నాయని తెలిపారు. ‘‘పాకిస్థాన్ గడ్డ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా ఆ దేశంతో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నాం. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించే దిశగా పాక్ కృషి చేస్తోంది’’ అని ప్రశంసించారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకోవాలని మోదీ, తానూ తీర్మానించుకున్నామన్నారు.
‘టెర్రిఫిక్’ లీడర్!
భారత్‌లో మత స్వేచ్ఛ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మోదీ టెర్రిఫిక్ లీడర్’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. ‘‘మోదీలో ఆధ్యాత్మికత ఎక్కువ. ప్రశాంతంగా ఉంటారు. కానీ, నిజానికి ఆయన బలమైన, ఎవరికీ లొంగని నాయకుడు. ఆయన రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూశాను. ఉగ్రవాదం పీచమణచడమే ఆయన ప్రాధాన్యాల్లో మొదటిది. ఆ సంగతి ఆయన చూసుకుంటారు’’ అని చెప్పారు. భారత్ ‘ట్రెమండస్’ (చాలా గొప్ప) దేశమని ప్రశంసించారు. ‘‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల పరిరక్షణ.. ఇలాంటి విలువలను పాటించే దేశాలు మనవి. భారత్‌తో భాగస్వామ్యం పెంచుకునే ముందు ఈ ఉమ్మడి లక్షణాలను గుర్తుచేసుకుంటాం’’ అని చెప్పారు.
అమ్మో... అంత సుంకమా?
వివిధ రంగాల్లో ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికగా, స్పష్టంగా చర్చలు జరిగాయని ట్రంప్ తెలిపారు. అదే సమయంలో భారత్ తమ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తోందని ఆక్షేపించారు. ‘‘హార్లీ డేవిడ్‌సన్ బైకులపై అత్యధిక సుంకం విధిస్తున్నది ఇండియానే. అమెరికా ఉత్పత్తుల విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించాలి’’ అని భారత్‌కు హితవు పలికారు. ‘‘సమగ్రమైన వాణిజ్య ఒప్పందంపై మా బృందాలు కసరత్తు చేస్తున్నాయి. ఇది త్వరలోనే కొలిక్కి వస్తుందనే నమ్మకముంది’’ అని ట్రంప్ తెలిపారు. త్వరలోనే ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక సంస్థ’ శాశ్వత కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘నేను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా ఎగుమతులు 60ు పెరిగాయి. ఇంధనరంగంలో ఎగుమతులు ఏకంగా 500 పెరిగాయి’’ అని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కరోనాపైనా ట్రంప్ మాట్లాడారు. ‘‘కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అతి త్వరలోనే సద్దుమణుగుతుంది. ఇందుకు చైనా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.’’ అని తెలిపారు. భారత్‌లో ‘ఇంటర్నెట్ స్వేచ్ఛ’ను కాపాడాలని మోదీని కోరినట్లు ట్రంప్ చెప్పారు.
ఆ ఒక్కటీ అడక్కు!
‘‘రెండు రోజుల పర్యటనకోసం మరో రెండు రోజులు ప్రయాణించి వచ్చాను. ఎవరో ఒక ప్రశ్న అడుగుతారు. దానికి ఏదో ఒకటి చెబితే అంతా తుస్సుమంటుంది. అందుకే ఆచితూచి సమాధానాలు చెబుతాను’’ అంటూ ముందుగానే పాత్రికేయుల ముందరి కాళ్లకు బంధం వేసేశారు. ట్రంప్ అంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు.. ‘‘ఇప్పుడు ప్రశ్నలేవీ అడగొద్దు. సాయంత్రం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడతాను. అప్పుడు ఎన్ని ప్రశ్నలైనా అడగండి’’ అని చెప్పారు.
మరోసారి హైదరాబాద్ ప్రస్తావన
భారత్‌లో మహిళా పారిశ్రామికవేత్తల ఉన్నతికోసం అమెరికా కృషి చేస్తుందని ట్రంప్ చెప్పారు. ఇందులో భాగంగానే తన కుమార్తె గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చారని... మహిళల ఆర్థిక సాధికారతను చాటిచెప్పేందుకే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. ‘థ్యాంక్యూ వెరీమచ్ ఇవాంకా’ అని కుమార్తెకు ధన్యవాదాలు తెలిపారు. కోల్‌కతా, ఢిల్లీల్లో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే ప్రాజెక్టులను అమలు చేస్తున్నామన్నారు.
నేను మళ్లీ గెలవకుంటే పతనమే!: ట్రంప్
ఈ ఏడాది నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కి చెప్పారు. ‘‘నేను గెలవకపోతే గతంలో ఎన్నడూ లేనంతగా స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడాలంటే నన్ను మళ్లీ ఎన్నుకోవాలి. అది అమెరికాకు వరంగా మారుతుంది’’ అని వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థిగా డెమొక్రాట్ నేత శాండర్స్ నిలిచినా స్టాక్ మార్కెట్ తాత్కాలికంగా క్షీణిస్తుందని చెప్పారు.