ఇప్పటివరకు చైనాపై ప్రతాపం చూపిన కొవిడ్ 19 క్రమంగా దక్షిణ కొరియానూ బెంబేలెత్తిస్తోంది. వైరస్ కారణంగా ఆ దేశంలో మృతుల సంఖ్య బుధవారం పదకొండుకు చేరింది. నిర్ధారిత కేసుల సంఖ్య ఒక్కరోజులోనే దాదాపు 300 పెరిగి 1,261కు చేరడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. చైనా ఆవల అత్యధిక కరోనా కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో దేశంలోని నాలుగో అతిపెద్ద నగరం, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న డ్యెగూకు ప్రభుత్వం మందులు, రక్షణ పరికరాలు పెద్దఎత్తున సరఫరా చేస్తోంది. 284 కొత్త కేసుల్లో 216 ఈ నగరంలోనే నమోదవడం గమనార్హం. ఒక్క రోజులోనే ఇక్కడి షించెయొన్‌జి చర్చి ఆరాధకులు 2 లక్షల మందిని పరీక్షించారు.
వైర్‌సపై పోరాటంలో ఈ వారం అత్యంత కీలకమైనదని ప్రధాని చుంగ్ సె క్యున్ అన్నారు. దక్షిణ కొరియాలోని శిబిరంలో ఉన్న అమెరికా సైనికుడు ఒకరు వైరస్ బారినపడ్డాడు. అటు కొరియా సొంత సైనికుల్లోనూ 18 కేసులు నమోదయ్యాయి. సిబ్బంది ఒకరు వైరస్ బారినపడ్డారని కొరియన్ ఎయిర్ ప్రకటించింది. భారీ ఎలకా్ట్రనిక్, ఆటోమొబైల్ పరిశ్రమలు పెద్ద కుదుపునకు లోనవుతున్నాయి. ఉద్యోగికి వైరస్ సోకడంతో శాంసంగ్ ఉత్పత్తి యూనిట్‌ను రెండు రోజులు మూసేసింది. చిప్ తయారీ సంస్థ ఎస్‌కే హైనిక్స్ 800 మందిని ఐసోలేషన్‌లో ఉంచింది. హ్యుందాయ్ స్టీల్ పోహాంగ్‌లోని ప్లాంట్‌ను, ఎల్జీ ఇంచియోన్‌లోని పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశాయి.
హ్యుందాయ్ మోటార్‌కు చైనా నుంచి విడిభాగాల సరఫరాలో అంతరాయం కలుగుతోంది. రిటైల్ మార్కెట్లు తాత్కాలిక షట్‌డౌన్ ప్రకటించాయి. బుధవారం నాటి 52 మరణాలు సహా చైనాలో కొవిడ్ మృతుల సంఖ్య 2,715కు చేరింది. 15 టన్నుల మందులతో భారత విమానం చైనా బయల్దేరింది. అత్యవసరమైతే తప్ప దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ వెళ్లొద్దని భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.