హైదరాబాద్ : సైబర్ నేరాలను కట్టడి చేయడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ప్రజల్లో మార్పు రావడం లేదు. అయితే విద్యార్థులు, యువతలో కొంత మార్పు వస్తున్నది. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి మోసపోతున్న కేసుల సంఖ్య ఇటీవల క్రమంగా తగ్గు ముఖం పట్టింది. ఈ ఏడాది 60 రోజుల్లో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాకు 1500పై ఫిర్యాదులు వచ్చాయి. అందులో వెయ్యి, రెండు వేలు కూడా మోసపోయిన బాధితులు ఉన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సైబర్‌క్రైమ్ పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌కు సంబంధించి మోసపోయిన బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఫిర్యాదుల్లో 400 ఫిర్యాదులకు సంబంధించిన వాటిలో ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి. గతేడాది కంటే ఈ ఏడాది భారీస్థాయిలో సైబర్‌నేరాలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాదిలో కొన్ని సైబర్ క్రైమ్ నేరాలను స్థానిక పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేసే నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పినా.. ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇది సాధ్యమవుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ఓటీపీలు.. ఓఎల్‌ఎక్స్‌లే ..
బ్యాంకు అధికారులం, కేవైసీ ఆప్‌డేట్, డెబిట్‌కార్డు బ్లాక్ అవుతుందంటూ ఫోన్లు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఈ నేరాలను తగ్గించేందుకు పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి నిర్వహిస్తున్నా.. ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. ఇతర రాష్ర్టాల్లో ఉంటూ మీ బ్యాంకు ఖాతాలను లూటీ చేసే సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటూ పదే పదే పోలీసులు చెబుతున్నా.. మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు. అయితే కేవలం నిరక్ష్యరాస్యులే మోసపోతున్నారంటే పొరపాటే... బాగా చదువుకున్న వారు, వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు, యువకులు బాధితుల్లో ఉంటున్నారు. అలాగే ఓఎల్‌ఎక్స్ కేసుల్లోనూ జరుగుతున్న మోసాలపై ఒక పక్క పోలీసులు.. మరో పక్క మీడియా విస్తృతంగా ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. అయినా కూడా ఓఎల్‌ఎక్స్‌లో పెట్టే వస్తువు తక్కువ ధరకు వస్తుందనే ఆశ.. తాము విక్రయించాలనుకునే వస్తువుకు మంచి ధర వస్తుందనే అత్యాశతో సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో పడి నిండుగా మోసపోతున్నవారి సంఖ్య క్రమేపి పెరుగుతున్నది. డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతోనే ఇలాంటి నేరాలను కట్టడి చేయవచ్చు.. అయితే అప్రమత్తతో లేకపోవడం, ఆశ, నిర్లక్ష్యం తోడవ్వడంతో మోసపోయే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ రెండు అంశాలకు సంబంధించిన బాధితులే ఎక్కువ సంఖ్యలో సైబర్ ఠాణాను ఆశ్రయిస్తున్నారు. వస్తున్న ఫిర్యాదుల్లో 50 శాతం ఇలాంటి కేసులకు సంబంధించిన బాధితులే ఉంటున్నారు.
తగ్గుతున్న జాబ్ మోసాలు
విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగ యువతలో మార్పు వస్తున్నది. డబ్బులు తీసుకుని ఎవరు ఉద్యోగాలు ఇవ్వరని, ప్రతిభతోనే ఉద్యోగం వస్తుందంటూ పోలీసులు కాలేజీలు, శిక్షణా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి జాబ్ ఆఫర్స్ వచ్చినా.. డబ్బు ప్రస్తావన వచ్చిందంటే వాటి విషయంలో యువత జాగ్రత్తగా ఉంటున్నది. కొందరు మోసపోతున్నా భారీ స్థాయిలో డబ్బు మాత్రం పొగొట్టుకోకుండా.. కొద్ది మొత్తం చెల్లించగానే అది మోసమని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.