హైదరాబాద్ : గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆధారంగా చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన గూగుల్ సంస్థ నోడల్ అధికారి గీతాంజలితో సమావేశమైయ్యారు. ఇందులో సైబర్‌క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అదనపు డీసీపీ దారా కవిత, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ.. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా చోటు చేసుకుంటున్న సైబర్ నేరాల గురించి వివరించారు. ఈ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వీటి నియంత్రణకు సహకరించాలని కోరారు. దీని కోసం గూగుల్ సంస్థ.. సైబర్ క్రిమినల్స్ ఏర్పా టు చేసిన లింక్‌లు, వెబ్‌సైట్‌లు సెర్చ్‌లో రాకుండా చేయాలని. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో నమోదవుతున్న వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఉండేలా మార్గదర్శకాలు సూచించాలని నోడల్ అధికారికి సూచించారు. పోలీసుల సూచన పై చర్యలు చేపడతామని నోడల్ అధికారి గీతాంజలి హామీ ఇచ్చారు.
సైబర్ క్రైమ్ పోలీసుల సూచనలు...
* గూగుల్‌లో సెర్చ్ చేయకుండా సంబంధిత వెబ్‌సైట్‌లు, ఈ-వాలెట్స్, ట్రావెల్ కార్యాలయాలు, కొరియర్ ఇలా ప్రతి సంస్థకు చెందిన వెబ్ సైట్‌లో శోధించాలి. గూగుల్ సెర్చ్‌లో చేయకపోవడం శ్రేయస్కరం.
* సైబర్ నేరగాళ్లు పంపే గూగుల్ వ్యూ ఫామ్ లింక్‌లో బ్యాం కు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్టులు, యూపీఐ పిన్ నంబ ర్లు, యూజర్ నేమ్..ఇంటర్నెట్ పాస్‌వర్డులను వెల్లడించవద్దు.