వైరస్ సోకిన వ్యక్తులు ఉన్న డైమండ్ ప్రిన్‌సెస్ నౌకలో నాలుగో వ్యక్తి మృతిచెందాడు. సుమారు 14 రోజుల పాటు ఆ నౌకను క్వారెంటైన్ చేసిన విషయం తెలిసిందే. జపాన్‌లో మొత్తం 850 కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో క్రూయిజ్ షిప్‌కు చెందినవారే 691 మంది ఉన్నారు. 3700 మంది ప్రయాణికులతో ఉన్న డైమండ్ ప్రిన్‌సెస్ నౌకను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్వారెంటైన్ చేశారు. అయితే ఇటీవల ఆ నౌకలోని ప్రయాణికులు విముక్తి అయ్యారు. మరోవైపు చైనాలోని హుబేయ్ ప్రావిన్సు మినహా.. దేశంలో కొత్తగా కోవిడ్19 నమోదు అయిన కేసుల సంఖ్య తగ్గింది. కేవలం సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదు అయినట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు చైనాలో కోవిడ్19 వల్ల మరణించిన వారి సంఖ్య 2663కు చేరుకున్నది. దక్షిణ కొరియాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. యురోపియన్ దేశం ఇటలీలోనూ కరోనా మరణాల సంఖ్య పెరిగింది. ఆ దేశంలో ఈ వైరస్ వల్ల నలుగురు మృతిచెందారు.