సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. మరోసారి కెప్టెన్‌గా..


హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ని నియమిస్తున్నట్లు జట్టు ప్రకటించింది. 2016లో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లోనే జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి వార్నర్‌ జట్టును విజేతగా నిలుపుతాడనే నమ్మకంతోనే ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 



2018లో బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో.. వార్నర్ ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ ఆడలేదు. 2019 ఐపీఎల్ ప్రారంభం అయ్యే సమయానికి అతనిపై ఉన్న నిషేధం ముగియడంతో అతన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అయితే కెప్టెన్సీ మాత్రం కేన్ విలియమ్‌సన్‌కు అప్పగించారు. అయినప్పటికీ వార్నర్ బ్యాటింగ్‌లో తన సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోతో కలిసి పలు మార్లు అత్యద్భుత భాగస్వామ్యాలు నమోదు చేసిన అతను 692 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫాంలో ఉన్న అతను కెప్టెన్‌గా కూడా సన్‌రైజర్స్‌కు విజయాలు అందించాలని జట్టు యాజమాన్యంతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. కాగా, తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీకి వార్నర్ సోషల్‌మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపాడు.